అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జోన్ల వారీగా నియమించిన ఐఏఎస్ అధికారులు (రోల్ అబ్జర్వర్స్) ఎన్నికల సంఘం నిర్దేశించిన విధుల్ని సక్రమంగా పాటించడం లేదని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి రోల్ అబ్జర్వర్లు వారి విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత ఇంటి డోర్ నెంబర్లతోనే ఓటర్ జాబితా ఇచ్చారని, జనవరి 5 న ఇచ్చే కొత్త జాబితాలో కొత్త ఇంటి నంబర్ల ప్రకారమే ఓటర్ల వివరాలు ఉండేలా చూడాలని కోరారు. ఓటర్ల జాబితాలోని పొరపాట్లు, రాష్ట్రంలోని అధికారులు చేస్తున్న తప్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు, సూచనలను కూడా ఖాతరు చేయకుండా అధికార వైసీపీ నేతల ఆదేశాలే పరమావధిగా పనిచేస్తున్న అధికారులు, కొందరు కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.