అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనసేన నేతలు, కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని, అలా మాట్లాడేవారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.. మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దాం అని పవన్ నినాదం ఇచ్చారు. పొత్తులో భాగంగా జనసేన చేసిన త్యాగాలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి చేసినవని చెప్పారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకుని.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరారు.
రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని వివరించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుంది. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదు. కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటాను. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా వారి సేవలు ఉపయోగించుకుంటా. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత అయిదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పది. మీ మద్దతు ఇలాగే కొనసాగించాలి.కూటమి అభ్యర్ధుల విజయానికి పూర్తి స్థాయిలో పని చేయాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
పవన్‌ను కలిసిన మాగుంట
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడిరచింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరడం తెలిసిందే.