- బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీఐఐసీ నూతన చైర్మన్ మంతెన
- మంత్రులు, నేతల అభినందనలు
విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీఐఐసీ నూతన చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్‌గా నియమితులైన మంతెన రామరాజు మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ భవన్‌లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరై చైర్మన్ మంతెన రామరాజుకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఏసీఐఐసీ చైర్మన్‌గా తనను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 2014 `19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పడకేసిందన్నారు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్నవాటినీ తరిమేశారన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పరిశ్రమలను రప్పించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు జీఎం చంద్రబాబు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు రామరాజు తెలియజేశారు. ప్రభుత్వంతో చర్చించి ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసీ ద్వారా చిన్న సంస్థలకు స్థలాలు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంతెన రామరాజు అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రామరాజును పలువురు మంత్రులు, నేతలు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
పెట్టుబడులకు పెద్దపీట వేయాలి: మంత్రి కొల్లు
ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు రాజు (రామ రాజు)ను సంస్థ కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. ఉన్నత విలువలతో రాజకీయం చేసే రామరాజు లాంటి వ్యక్తి ఏపీఐఐసీ లాంటి కీలక వ్యవస్థలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. రామరాజు నాయకత్వంలో పెట్టుబడులకు గమ్యస్థానంలా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు
ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రామరాజుకు రాష్ట్ర రోడ్లు,భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంతెన రామరాజుకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. రామరాజు నాయకత్వంలో ఏపీఐఐసీ ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు.
మంత్రి డోలా శుభాకాంక్షలు
ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రామరాజుకు మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అభినందనలు తెలియజేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయానికి వెళ్లి రామరాజుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.