రెండిరటిలో అభివృద్ధి పనులు చేపట్టాలి
అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం
ఎమ్మెల్యే కందుల వినతితో స్పందించి సమీక్ష
హాజరైన జలవనరుల మంత్రి నిమ్మల
వెలగపూడి : ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో తాగునీటి ఎద్దడిని అరికట్టాలని మంత్రి నారాయణను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. ప్రతి ఏటా జూలై రెండవ వారంలో నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీలకు నీటిని విడుదల చేస్తారని… దానికంటే ముందుగానే ఈసారి తాగునీటి సమస్య వచ్చిందని వివరించారు. స్పందించిన నారాయణ వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో తన చాంబర్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మార్కాపురం, పొదిలి మున్సిపల్ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండు మున్సిపాలిటీ ల్లో బోర్లు ఉన్నప్పటికీ ఆ నీరు తాగడానికి పనికిరాని విధంగా ఉందని.. ఇతర అవసరాలకు మాత్రం ఆ నీరు వాడుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. తాగునీటికి ముందు ప్రాధాన్యం ఇచ్చి అవసరమైనన్ని ట్యాంకర్లను వినియోగించాలని మంత్రి వారికి సూచించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో ఈ రెండు మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అటు నాగార్జునసాగర్ ఇంజనీరింగ్ అధికారులతోనూ జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశంపై ఫోన్లో మాట్లాడారు. సాగర్‌లో ప్రస్తుతం నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. నాగార్జునసాగర్‌లో వాస్తవ పరిస్థితి, తాగునీటి సరఫరాపై వివరాలు అందించాలని అధికారులను నిమ్మల ఆదేశించారు. మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీలకు తాగునీరు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో హాజరుకావాలని సూచించారు.