అమరావతి(చైతన్యరథం): సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కచ్చితంగా తిరిగి పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కులం పేరుతో దూషించి, తన సంతకం ఫోర్జరీ చేయడంపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి .. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేశారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలసి ముత్తుకూరు సర్పంచ్ తనకు ఎదురైనా ఇబ్బందులు, అవమానాలను వివరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తునట్లు తెలిపారు.
దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మిపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి సంతకాలు ఫోర్జరీ చేసిన విషయం పై వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. సంతకాల ఫోర్జరీపై విచారణ చేపడతాము. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని పవన్ చెప్పారు.