- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
- ఆరోగ్యశ్రీకి వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు
- గతం మరిచి ఇప్పుడు విమర్శలు
- వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మండిపాటు
రాజమండ్రి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,840 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే, రూ.2120 కోట్ల పనుల మాత్రమే ఖర్చు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దాంట్లో కూడా రూ.700 కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని శనివారం మంత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పులివెందుల మెడికల్ కళాశాలలో సీట్లు అడ్డుకున్నారని జగన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థులకు ఏ విధంగా వైద్యవిద్య అందిస్తారన్నారు.
వైద్యవిద్య అందించాలంటే కొన్ని ప్రమాణాలుంటాయని.. అవి పాటించకుండా చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టే అని అన్నారు. రాష్ట్రంలో 12 వైద్య కళాశాలల్లో రాబోయే ఏడాది నుంచి విద్యార్థుల ప్రవేశాలు చేపడతామన్నారు.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చే విషయాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజమండ్రి జిజిహెచ్ లో 304 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 180 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీ పోస్టులు ఉండగా, 28 ఖాళీలు ఉన్నాయన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు 13 సార్లు నోటీసులు ఇచ్చాయి. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.652 కోట్ల బకాయిలు తాము చెల్లించామని తెలిపారు. వచ్చిన మూడు నెలల్లోనే వేలాది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం భారమే.. కానీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. వికలత్వ ధృవీకరణకు సంబంధించి సదరం సర్టిఫికెట్ల విషయంలో సర్వే జరుగుతోందన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారి పింఛన్‌లు తొలగిస్తామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని తేలితే వైద్యులపైనా చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.