శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్‌ఏ `చైతన్య రథం): అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో అడోబ్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) లేదా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా టెక్ సంస్థలైన ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్‌వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్‌లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపాలని కోరారు. ‘‘మీరు డైరెక్టర్‌గా ఉన్న ఫైజర్ సంస్థ ఏపీలోని ఔషధ పరిశ్రమ జోన్లలో (విశాఖపట్నం ఏఎంటీజడ్) వ్యాక్సిన్లు, చిన్న మాలిక్యూల్స్ లేదా బయోలాజిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పరిశోధనా సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్, వ్యాధి వ్యాప్తి అధ్యయనాలు, డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రోత్సహించండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఫార్మా జోన్లు, ఏఎంటీజెడ్ (అంధ్రా మెడ్ టెక్ జోన్) సామర్థ్యాలను వినియోగించుకునేలా చొరవ చూపండి. మీరు డైరెక్టర్‌గా కలిగిన మరో సంస్థ కెకెఆర్ ప్రధానంగా ఆరోగ్యం, ఔషధ పరిశోధన, బయో-ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ పైప్‌లైన్లు మొదలైన రంగాల్లో కీలకమైన ఉనికిని కలిగి ఉంది. (కేకేఆర్ సుమారు 750 యూఎస్ బిలియన్ డాలర్ల విలువైన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ) ఏపీలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించండి’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అడోబ్ సీఈవో శంతను నారాయణన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.














