ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నేషనల్ హైవే 167 లో భాగంగా ప్రతిపాదించిన ఆదోని బైపాస్ రోడ్డు ఎలైన్ మెంట్ -2 ఆదోని పట్టణ మాస్టర్ ప్లాన్ కు విరుద్దమైనది. దీనివల్ల 40సంవత్సరాల క్రితం ఆమోదించిన లేఅవుట్లు, ఆవాసాలు దెబ్బతిని, 40 ఏళ్లనుంచి ఉంటున్న 400 కుటుంబాలను ప్రభావితం చేస్తుంది.
కేవలం కొద్దిపాటి వ్యవసాయ భూములు మాత్రమే ప్రభావితమయ్యే ఎలైన్ మెంట్ -3ని పరిగణనలోకి తీసుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఆయన మనుషులకు చెందిన భూములకు విలువ పెంచుకునేందుకు, ఆభూములకు సమీపం గుండా జాతీయరహదారి వెళ్లేలా ఎలైన్ మార్పులు చేస్తున్నారు. ఆదోని పట్టణంలో 4దశాబ్ధాలుగా నివసించే ప్రజలకు నష్టం జరగకుండా ఎలైన్ మెంట్ -3 ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి వినతులపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి నేతలు వారి స్వార్థం కోసం ఎన్ని వందలమంది ప్రయోజనాలైనా దెబ్బతీయడానికి వెనకాడటం లేదు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల భూములు రేట్లు పెంచుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణం. అదోని మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా ఎలైన్ మెంట్ మార్పుపై హైవే అథారిటీకి లేఖరాస్తాం అని వెల్లడించారు.