- జగన్‌రెడ్డిపై సోమిరెడ్డి ధ్వజం
- ఐదేళ్ల దోపిడీ ఫలితం..విద్యుత్ సంస్థలపై రూ.1.29 లక్షల కోట్ల భారం
- అవినీతిలో అంతర్జాతీయ స్థాయికి జగన్ పేరు
నెల్లూరు (చైతన్యరథం): దేశ చరిత్రలోనే జగన్ రెడ్డిలా అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి మరొకరు లేరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రోడ్డెక్కడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ కరెంట్ చార్జీల విషయంలో వైసీపీ వాళ్లు రోడ్డెక్కి ధర్నాలు చేయడం చూస్తుంటే.. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి రూ.1.29 లక్షల కోట్ల భారాన్ని విద్యుత్ సంస్థలపై మోపి ఎన్నికల్లో ఘోరంగా ఓడి ఇంటికి పోయాడు. ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాన్ని మోపాడు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. 2019లో చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయే నాటికి లోటును అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. జగన్ రెడ్డి తాను చేసిన పాపాలను మరో 30 ఏళ్లు ప్రజలు అనుభవించాలంటున్నాడు. 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.2.49 కొనుగోలు చేసేలా సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. అదే సమయంలో గుజరాత్ యూనిట్ రూ.1.99కే అగ్రిమెంట్ చేసుకుంది. మరో పదేళ్లకు సోలార్ విద్యుత్ యూనిట్ రూ.1.25కి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ మన జగన్ రెడ్డి మాత్రం 30 ఏళ్ల పాటు రూ.2.49కే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుని వెళ్లాడు. ఆ ఒప్పందం పూర్తయ్యేసరికి ఆయన ముత్తాత అవుతాడు. జగన్ రెడ్డి బరితెగించి రూ.1750 కోట్లు లంచం తీసుకున్న పాపానికి ప్రజలపై అదనంగా లక్ష కోట్ల భారం పడుతోందని సోమిరెడ్డి విమర్శించారు.
సిగ్గు లేకుండా..
ఏపీ సీఎంగా జగన్ రెడ్డి లంచం తీసుకున్నాడని అమెరికాకు చెందిన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడిరచింది. అయినా సిగ్గులేకుండా జగన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను 30 ఏళ్ల గడువుకు తాకట్టుపెట్టి, ఇప్పుడు నిరసనల పేరుతో రోడ్డెక్కడానికి సిగ్గుండాలి. కేబినెట్ ఆమోదం లేకుండానే ఒప్పందాలు చేసి ప్రజలపై మోయలేని భారం మోపారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక్క పవర్ ప్లాంటు కూడా నిర్మించకుండానే విద్యుత్ సంస్థల పేరుతో రూ.49 వేల కోట్లు అప్పులు చేశాడు. జగన్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురైదుగురు రెడ్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా విద్యుత్ రంగంలో దోపిడీ జరిగింది. కృష్ణపట్నంలోని ఏపీ జెన్ కో థర్మల్ పవర్ ప్లాంటుకు రూ.281 కోట్ల విలువైన 4.50 లక్షల టన్నుల నాసిరకమైన బొగ్గును సరఫరా చేసి దోచుకున్నారు. మట్టితో కూడిన ఆ బొగ్గుతో ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని జెన్ కో ఉద్యోగులు తిరగబడే పరిస్థితి తెచ్చారు. జగన్ రెడ్డి అవినీతి దెబ్బకు అమెరికాలోని ఎఫ్‌బీఐ నుంచి నేలటూరులోని జెన్ కో ఉద్యోగుల వరకు రోడ్డెక్కారు. అయినా సిగ్గు, శరం లేకుండా నిరసనల పేరుతో ఊరేగింపులు చేసుకున్నారని సోమిరెడ్డి తప్పుబట్టారు.
స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీ
స్మార్ట్ మీటర్ల విషయంలోనూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేకుండా ఏపీలో పెట్టేందుకు అనుమతిచ్చిన ఘనుడు కూడా జగన్ రెడ్డే. ఒక్కో స్మార్ట్ మీటర్ కు రాజస్థాన్ లో రూ.7943, ఛండీగడ్‌లో రూ.9710 ఖర్చు చేస్తే ఏపీలో మాత్రం రూ.36975 ఖర్చుచేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు జీవితకాలం బాధపడే పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇంత బరితెగించి దోపిడీకి పాల్పడిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే లేరు. జగన్ ధనదాహంతో ఏపీలో ఐదేళ్ల పాటు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేశాడు. ఇలాంటి వ్యక్తులకు విద్యుత్ భారం పేరుతో ధర్నాలు, ప్రదర్శనలు చేసే నైతిక హక్కు లేదు. విద్యుత్ ఛార్జీల పేరెత్తే అర్హత కూడా వైసీపీ నాయకులకు లేదు. ప్రజలపై భారం ఎలా తగ్గించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని సోమిరెడ్డి స్పష్టం చేశారు.