అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ లో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పొడిగించాలని లోకేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేష్ హితవు పలికారు. 2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవుతూ రావటం దురదృష్టకరం. నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. అసత్య వాగ్దానాలు గుడ్డిగా నమ్మి విశ్వసించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక జగన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. గత నాలుగన్నరేళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు. నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్నందున అకస్మాత్తుగా నిద్ర మేల్కొని గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచనకు జగన్ సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎంతో మంది నిరుద్యోగ యువత అశలపై నీళ్లుచల్లుతోంది. నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఎంతో మంది నిరుద్యోగ యువత అనర్హులవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వయో పరిమితి నిబంధన కారణంగా దరఖాస్తు చేసుకోలేని యువతకు సడలింపు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో గరిష్ట వయోపరిమితిని కనీసం 44 సంవత్సరాలకు పెంచాలి. రాష్ట్ర యువతకు జగన్ చేసిన మోసానికి పరిహారంగా అయినా వయోపరిమితి పెంచాలని లోకేష్ డిమాండ్ చేశారు.