అమరావతి: ఏపీలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ జగన్ చేసిన హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ నాటకాలకి యువత బలవుతోందన్నారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోయిన యువత బలవన్మరణాలకి పాల్పడుతోంది. ప్రతీ ఏటా జనవరి 1నే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ లేదు. నాలుగున్నరేళ్లకి పైగా జగన్ పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదు. ప్రతి ఏటా 2 లక్షలకి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తానని యువతని మోసగించాడు. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఉసూరుమంటోన్న యువత ఆత్మహత్యలకి ముమ్మాటికీ జగనే కారకుడు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో అనంతపురం జిల్లా, కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఈ ఆత్మహత్యలకి కారకుడైన జగన్ కి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. నిరుద్యోగ యువతకి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవిస్తున్నాను, ఉద్యోగాలు రాలేదని అఘాయిత్యాలకి పాల్పడొద్దు. ఒక్క ఆరు నెలలు ఓపిక పట్టండి. టీడీపీ ప్రభుత్వం వస్తుంది. మీ ఉద్యోగ, ఉపాధికి భరోసా ఇస్తుందని ఒక ప్రకటనలో లోకేష్ హామీ ఇచ్చారు.