- అహంకారం, విచ్చలవిడి తనాన్ని ప్రజలు అంగీకరించరు
- పార్టీలో సంస్థాగత మార్పుల కోసం ఆలోచన
- ఒక పదవిలో రెండుసార్లు మాత్రమే ఉండాలనే అంశంపై చర్చ
- నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీచేస్తాం
- రఘురామ ఇంట్లో కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్
- కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ గృహాన్ని సందర్శించిన యువనేత
ఉండి/భీమవరం (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెద అమిరంలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నివాసాన్ని మంత్రి లోకేష్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో లోకేష్ మాట్లాడుతూ… నాయకుల పర్యటనల్లో ఎటువంటి హంగు, ఆర్భాటాలు వద్దు.. అహంకారం, విచ్చలవిడితనాన్ని ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. జగన్ హయంలో జరిగిన విధ్వంసం వలన రాష్ట్ర్రం తీవ్రంగా నష్టపోయింది. నెలకి రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం నడుస్తోంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఒకే సారి వెయ్యి రూపాయిలు పెంచాం. దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నది మనమే. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అన్న క్యాంటీన్లు తెరిచాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేసేందుకు కృషిచేస్తున్నాం. మనల్ని ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేదం అని చెప్పి జె-బ్రాండ్లతో దోచుకున్నారు, తన పాలనా కాలంలో అమ్మ ఒడి మూడు ఏళ్లు మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు, పెన్షన్ పంపిణీలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.
టీడీపీలోనే కార్యకర్తలకు పెద్దపీట
కార్యకర్తలకు టీడీపీ ఇచ్చే ప్రాధాన్యత ఇతర ఏ పార్టీ ఇవ్వదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. ఈసారి కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయం అందిస్తాం. కార్యకర్తల ఆరోగ్యం కోసం కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. కార్యకర్తల పిల్లల ఉద్యోగాల కోసం కూడా పార్టీ కార్యాలయం ద్వారా సాయం అందించేలా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. గత ఐదేళ్లలో చట్టాన్ని అతిక్రమించి అరాచకాలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. మరో నెల రోజుల్లో అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. గత ఐదేళ్లు క్షేత్ర స్థాయిలో పని చేసిన వారికే ప్రాధాన్యతనిస్తాం. గ్రామ స్థాయి కార్యకర్తను పొలిట్‌బ్యూరో స్థాయికి తీసుకెళ్లేలా ఒక ఆలోచన చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దానిపై నిర్ణయం తీసుకుంటాం. రెండు పర్యాయాలు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఉన్న పదవి నుంచి వైదొలగి ఒక టర్మ్ ఖాళీగా అయినా ఉండాలి. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటే నేను, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే విడత పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేసే వారు పొలిట్‌బ్యూరో వరకూ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై పార్టీలో నిరంతరం చర్చ జరగాలి. అప్పుడే పార్టీ పది కాలాలపాటు వర్థిల్లుతుందని మంత్రి లోకేష్ చెప్పారు.
శ్రీనివాసవర్మ గృహాన్ని సందర్శించిన లోకేష్
రఘురామ నివాసం నుంచి భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ గృహాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇంటి దగ్గర మూడు పార్టీల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గత అరాచక పాలన అంతమొందించేందుకు అన్ కండిషనల్‌గా ఎన్డీయేకి మద్దతు పలికాం. అందుకే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోంది. రాజమండ్రి సభలో ప్రధాని ఎన్ని సీట్లు గెలుస్తాం అని అడిగితే 22 ఎంపీ సీట్లు గెలుస్తాం అని చెప్పాను, 21 సీట్లు గెలిచాం. నాటి సైకో పాలనలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు నలిగిపోయారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ సమగ్రత కోసం అందరూ కలిసి పనిచేయాలి. 2047 `వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ ప్రధాని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని లోకేష్ పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు పులివర్తి రామాంజనేయులు (భీమవరం), కామినేని శ్రీనివాస్ (కైకలూరు), తదితరులు పాల్గొన్నారు.