- 90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి
- రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ వేగవంతం
- త్వరితగతిన మెట్రో రైలు పనులు
- రాజధాని నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం
- హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ
- సీఆర్డీయేపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా అమరావతి లోగోను.. ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించిందన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. జీ ప్లస్ 7 విధానంతో తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయ నిర్మాణానికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనులు తప్పించి, గత ఐదేళ్లలో అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదల్లేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తిగా వదిలేసిందని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవన నిర్మాణాలకు కూడా అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు సూచించారు.
హ్యాపీనెస్ట్నూ గత ప్రభుత్వం నిలిపేసింది
టీడీపీ ప్రభుత్వం రాజధానిలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసముండాలని కోరుకునే వాళ్ల కోసం 14 ఎకరాల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూపొందించామని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు. అప్పట్లో హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ ఒక్క గంటలో అమ్ముడపోయాయని, అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపేయడంతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోయారని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. దీనివల్ల సీఆర్డీఏకు భారీ నష్టం వచ్చిందన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వ చర్యలతో ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారును సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించాలన్నారు. రాజధానికి సంబంధించి ఇంకా 3,558 ఎకరాలు సేకరించాల్సి ఉందని, రాజధాని పరిధిలోని రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని సీఎంకు అధికారులు తెలిపారు.
అయితే డెవలప్ చేసిన ప్లాట్లను ఆ రైతులకు కేటాయించే విషయంలో చిన్న చిన్న అభ్యంతరాలున్నాయని అధికారులు వివరించగా రైతులతో మాట్లాడి దాన్ని పరిష్కరించి ముందుకెళ్లాలని సీఎం సూచించారు. రాజధానిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్షించారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచీ మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. బిల్డింగ్ నిర్మాణం, క్లియరెన్స్‌లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు. జంగిల్ క్లియరెన్స్ మదింపునకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎం అన్నారు. క్లియరెన్స్ పనులు కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. జంగిల్ క్లియరెన్స్ పనులను వీలయినంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి
విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును రెండు పేజ్‌ల్లో చేపడతామని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి.. సీఎంకి వివరించారు. ఫేజ్-1లో 46 కిలో మీటర్ల మేర రూ.11,400 కోట్ల వ్యయంతో మెట్రో రైలు నిర్మిస్తామని, తరువాత ఫేజ్-2లో 30 కిలోమీటర్ల మేర రూ.5,734 కోట్లతో మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. ఫేజ్-1 మెట్రో రైలు పనులు మొదలు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర రూ.11వేల కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.