- ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టం
- ఈ ఘన విజయం అమరావతి రైతులకే అంకితం
- సుస్థిరత, రాష్ట్ర ప్రగతి, అభివృద్ధికి.. కొత్త నాంది
- ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు
- ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ఆమోదంపై సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించడం.. రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు`2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు, వారి సంకల్పానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు దేశ రాజధానిలో ప్రతిధ్వనించాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. అమరావతి ప్రస్తానంలో ప్రధాని మోదీ ప్రతీ కీలక ఘట్టంలోనూ అండగా నిలిచారని గుర్తు చేశారు. 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన చేయటంతోపాటు, 2025 మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులను కూడా ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. అమరావతికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వానికి, రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అనేక సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొందని… అలాంటి క్లిష్ట సమయంలో అమరావతి రైతులు చేసిన అమూల్యమైన త్యాగం, వారి పట్టుదల, నమ్మకం రాజధాని కలను సజీవంగా ఉంచాయని కొనియాడారు. ఈ చారిత్రక విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా పేర్కొంటూ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరం. దీనిపై ఇక ఎటువంటి అనుమానాలకు, చర్చలకు తావులేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్ అని సీఎం పేర్కొన్నారు. దేశానికే అమరావతి ఒక అద్వితీయమైన భవిష్యత్ నగరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ద్వారా లభించే ఈ స్థిరత్వం ప్రతి ఆంధ్రుడిలో కొత్త విశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.














