- డీజీపీకి హోంమంత్రి అనిత ఆదేశం
- న్యాయం చేస్తానంటూ కుటుంబానికి హామీ
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన మైనర్ ఉప్పాల అమర్‌నాథ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. తన సోదరిని వేధించవద్దని వారించిన కారణంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన 16 ఏళ్ల అమర్‌నాథ్‌ని గతేడాది పెట్రోల్ పోసి నిప్పంటించారంటూ బాధిత కుటుంబం, గౌడ సేన నాయకులు హోంమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీచేసి వేగంగా దర్యాప్తు చేయాలని, నిందితులకు శిక్షపడేలా చూడాలంటూ గురువారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. నిందితులకు బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో.. మృతుడి తల్లినీ బెదిరించిన పరిణామాలను హోంమంత్రికి వివరించారు. ఎన్నికలకుముందు తెలుగుదేశం జయహో బీసీ సభల్లో నారా లోకేష్ తమకు న్యాయం చేస్తామని ప్రకటించిన విషయాన్ని గౌడ సంఘం గుర్తుచేసింది. ఘటన జరిగిన సమయంలో అమర్‌నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సైతం.. అండగా నిలబడతామని హామీ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. తక్షణం స్పందించిన హోంమంత్రి.. అమర్‌నాథ్ హత్య కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి వేగంగా దర్యాప్తు చేయాలని డీజీపీ ద్వారకాతిరుమలరావును ఆదేశించారు. నిందితులకు చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బాధిత కుటుంబసభ్యులు, జై గౌడ సేన జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు తదితరులు ఉన్నారు.