హైదరాబాద్: భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘సీఎస్‌ఆర్’ ఆక్టివిటీలో భాగంగా రక్తదాన శిబిరాలు, వైద్య సేవల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చిన అంబులెన్సును బుధవారం మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్‌కి ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా చూడటం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ ముఖ్య లక్ష్యం అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ఇన్ని సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తుందంటే దానికి కారణం దాతలే అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సామాజిక సేవను బాధ్యతగా భావించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కి తమకు తోచిన విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ కే. రాజేంద్ర కుమార్ (ఐపీఎస్, రిటైర్డ్), సీఓఓ గోపి, భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ పి. పూర్ణచంద్ర రావు, జనరల్ మేనేజర్ కే. రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.