రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ప్రభుత్వం మానసికంగా ఏమీ చేయలేక శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రులు కొత్తపల్లి జవహర్, పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 12న చంద్రబాబుకు డాక్టర్లు పరీక్షలు చేసి శరీరంపై బొబ్బలు, అలర్జీ వచ్చాయని చెప్పారని, దానికి తగ్గ వైద్యం డాక్టర్లతో అధికారులు ఇంతవరకూ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలో నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ చంద్రబాబుతో శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం వద్ద కొత్తపల్లి జవహర్, పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జవహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చిన వ్యాధులకు చల్లటి వాతావరణంలో ఉండకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. వ్యక్తిగత వైద్య సిబ్బంది కూడా చంద్రబాబుకు వచ్చిన వ్యాధి ప్రమాదకరమైనదని చెప్పారు. గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి చంద్రబాబుకు ఉంది..దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని వ్యక్తిగత వైద్యులు నివేదిక ఇచ్చారు. జైల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. భూగర్భంలో పెట్టినా చంద్రబాబును మానసికంగా ఏమీ చేయలేరు..అందుకే ఆరోగ్యపరంగా హింసించాలని చూస్తున్నారు. సజ్జల స్క్రిప్టును చదివే అధికారులారా ఖబడ్దార్..ఇంతకింత మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. చంద్రబాబుకు హాని తలపెడితే ఆందోళలనలకు దిగుతాం. లోకేష్, భువనేశ్వరి ముఖ కవళికలను చూస్తేనే చంద్రబాబు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోంది. 12వ తేదీన డాక్టర్లు చేసిన పరీక్షలకు ఎందుకు వైద్యం నిర్వహించడం లేదు.? ఈ వయసులో ఏదన్నా వ్యాధి వస్తే తగ్గడానికి ఎంతో సమయం పడుతుంది. అందువల్ల వెంటనే తక్షణ వైద్యం అందించాలి. 12వ తేదీన డాక్టర్లు పరీక్షలు చేస్తే వాస్తవ నివేదికను ఈ రోజు దాకా డీఐజీ బయటపెట్టలేదు..ఈ ఆలస్యానికి అర్థం ఏమిటని నిలదీశారు.
పీతల సుజాత మాట్లాడుతూ…చంద్రబాబును జైల్లో పెట్టినప్పటి నుండి మేం చెప్తూనే ఉన్నాం..సరైన సౌకర్యాలు లేవు..భద్రత లేదు. అనారోగ్యానికి గురయ్యేలా చల్లటి నీళ్లు స్నానానికి ఇస్తున్నారని చెప్తే వేడినీళ్లు కావాలా అని వైసీపీ నేతలు హేళనగా మాట్లాడుతున్నారు. వాటర్ ట్యాంకర్లో నీళ్లు కూడా శుభ్రంగా లేవు. చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ప్రజల్లో అనుమానం ఉంది. చంద్రబాబును చూసి బాధలో ఏమీ చెప్పలేక భువనేశ్వరి, లోకేష్ మీడియా ముందుకు రాలేదు. ఈనెల12న టెస్టులు చేస్తే ఇప్పటి దాకా ఎందుకు బయటపెట్టలేదు..వైద్యం ఎందుకు చేయలేదు.? సజ్జలే ఇవన్నీ నడిపిస్తున్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటున్నారు. చంద్రబాబుకు ఏదైనా అయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు