ఒంగోలు: ఏపీలో జగన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రశ్నించే వారిని కేసులతో వేధిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురంధేశ్వరి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తోందన్నారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదన్నారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ వర్గాలనే మోసం చేస్తున్నారన్నారు. ఎస్సీలు, బీసీలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. వాస్తవానికి ఆయా ఘటనల్లో నిందితులకే ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు.