- సొంత నిధులతో రంగంలోకి మంత్రి నారా లోకేష్
- సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు శ్రీకారం
- 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలు
- కార్మికులకు సొంతంగానే జీతాలు చెల్లించనున్న మంత్రి
- నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చిమొక్కలు తొలగింపు
- లోకేష్ చొరవ పట్ల స్థానికుల హర్షం
మంగళగిరి(చైతన్యరథం): ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరి నియోజకవర్గంలో సొంత నిధులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన యువనేత నారా లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి అయినప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. పరిశుభ్ర మంగళగిరి కోసం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచటంపై మంత్రి లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా 5 గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీతభత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు రూ.18వేల వరకు ఖర్చు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మంగళగిరి పట్టణంలోని పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయా పనులను టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.