- గత పాలకుడి తప్పులు సరిదిద్దుతున్నామన్న సీఎం
- రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్ష
- అన్యాక్రాంత భూముల లెక్కలు తీయాలని ఆదేశం
- జగన్ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను ఏంచేయాలనే విషయమై చర్చ
అమరావతి (చైతన్యరథం): ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. పట్టాదారు పాసు పుస్తకాలు సహా భూమి యాజమాన్య హక్కు పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను మాత్రమే పరిమితం చేశారు. దీంతో రైతులు, భూ యజమానులు సైతం ఊపరిపీల్చుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదన్నది ప్రజల అభిప్రాయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాసుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గత ప్రభుత్వం తరహాలో అహంకారం, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండబోవని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ..
వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు ముద్రించి రైతులకు, భూయజమానులకు అందించారు. దీంతో తమ పట్టా పుస్తకాల పై, భూముల పత్రాలపై పై జగన్ ఫొటోలు ఎందుకని రైతులు నిలదీశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని.. వాటిని తిరిగి రాజముద్రతో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఇచ్చేవాటికి మాత్రం ఎవరి బొమ్మ లేకుండానే రైతులకు, భూయజయమానులకు అందించనున్నారు. దీంతో రైతులకు, భూయజమానులకు భారీ ఊరట లభించనుంది. నిజానికి ఏ రాష్ట్రంలో కూడా.. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా.. ప్రజల సొంత ఆస్తుల పత్రాలపై తమ బొమ్మలు చేసుకునేందుకు సాహసించలేదు.
అంతకు ముందు సచివాలయంలో రెవెన్యూ. రిజిస్ట్రేషన్ల శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూశాఖలో ప్రస్తుత పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. మదనపల్లె తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గత ఐదేళ్లలో తెచ్చిన చట్టాలు, దుర్వినియోగమైన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజల పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఈ సందర్భంగా రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు.
కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. మాజీ సీఎం బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై జగన్ బొమ్మలు చెరిపేసేందుకు మరో రూ.15కోట్లు ఖర్చవుతుందని అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని గుర్తించారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చేయాలో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
జిల్లాల వారీగా ఏ మేరకు భూములు అక్రమంగా అన్యాక్రాంతం అయ్యాయో లెక్కలు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్‌ఏ కమిషనర్‌లు ఆయా జిల్లాల్లో పర్యటించి సమాచార సేకరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ల దగ్గర మరోసారి పరిశీలించి వాటిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని సీఎం ఆదేశించారు.