- పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
రాయచోటి(చైతన్యరథం): రాష్ట్రంలో పేదలెవరూ ఆకలితో అలమటించకూడదనే వారి కడుపు నింపాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని రవా ణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం తిరి గి అన్న క్యాంటీన్లు ప్రారం భించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తొలగించి పేదల పొట్టకొట్టిందని, కూటమి తిరిగి ప్రారంభించి వారి కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో తొలి విడత 100 క్యాంటీన్లు ప్రారంభించగా.. రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. దినసరి కూలీలు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, వివిధ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతి క్యాంటీన్ వద్ద పూటకు 400 మంది చొప్పున రోజుకు 1200 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనం ఉంటుందన్నారు. ఇకనుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆకలికేకలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.