- ఈ పవిత్రతను దాతలు ముందుకు తీసుకెళ్లాలి
- మొత్తం 203 క్యాంటీన్లను పునరుద్ధరిస్తాం
- శుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం..
- వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించా
- ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
- సచివాలయంలో అన్న క్యాంటీన్ ప్రారంభం
అమరావతి (చైతన్య రథం): పేదల ఆకలి తీర్చాలన్న పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్లను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. పవిత్ర అన్నదాన బృహత్కార్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌ను ప్రారంభించి.. ప్రజలకు స్వయంగా ఫలహారం వడ్డించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చిన కొంతమంది మహిళలు, ఆటో డ్రైవర్‌తో సీఎం కొద్దిసేపు ముచ్చటించారు. అన్నకాంటీన్ ద్వారా అందిస్తున్న ఆహార వంటకాలు ఏవిధంగా ఉన్నాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రూ.5కే బలవర్థకమైన ఆహారాన్ని అందించడంపట్ల అక్కడివారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత 5ఏళ్ళకాలంలో అన్న క్యాంటీన్లులేక భోజనం కోసం అనేక ఇబ్బందులు పడ్డామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 175 అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. గతంలోవున్న 203 క్యాంటీన్లను పూర్తిగా పునరుద్ధరిస్తాం. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి ఉండేలా.. పట్టణాల్లో అయితే మరిన్ని అన్నక్యాంటీన్లు అందుబాటులోకి తేనున్నాం. పూటకు కేవలం రూ.5కే చొప్పున మూడు పూటలా రూ.15కే రుచికరమైన, పౌష్ఠికాహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో అందిస్తున్నా. దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదు. పేదవాడి ఆకలి దప్పులు తీర్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్నక్యాంటీన్లు గత ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసింది’ అని చంద్రబాబు అన్నారు.
వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీ..
బుడమేరు వరద బాధితులకు గతంలో ఎన్నడూలేని విధంగా.. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని రీతిలో మానవతా దృక్పధంతో మెరుగైన ఫ్యాకేజీ అందించి అన్నివిధాలా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం బుడమేరును పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే వరద పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. 10 రోజులపాటు అధికార యంత్రాంగమంతా బాధితులకు అండగావుండి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించామన్నారు. ఇళ్ళచుట్టూ నీరు చేరిన గ్రౌండ్‌ఫ్లోర్ కుటుంబాలకు రూ.25 వేలు, మొదటి ఫ్లోర్‌కి రూ.15 వేలు, ఆపై ఫ్లోర్‌లకు రూ.10వేల వంతున పరిహారం ఇవ్వడంతోపాటు, వరద బాధితులందరికీ 25 కిలోల బియ్యంతో కూడిన 6రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు అందించి ఆదుకున్నామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని తానిచ్చిన పిలుపునకు స్పందించి గతంలో ఎన్నడూ లేని విధంగా దాతలు పెద్దఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలు అందించడంపట్ల రాష్ట్ర ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ సీఎం సహాయ నిధికి రూ.350 కోట్ల వరకూ విరాళాలు అందాయన్నారు.
బుడమేరు ఆధునీకరణను నిర్లక్ష్యం చేశారు
మునుపటి తెదేపా ప్రభుత్వంలో బుడమేరు ఆధునీకరణలో భాగంగా ఐదు పనులకు రూ.150 కోట్లు మంజూరు చేస్తే.. గత జగన్ ప్రభుత్వం పనులను రద్దుచేయడంతో పాటు పలు ఆక్రమణలకు పాల్పడంతో బుడమేరు వరదను ఎదుర్కోవాల్సి వచ్చిందని సీఎం వివరించారు. మరోసారి విపత్తు చుట్టుముట్టకుండా.. బుడమేరు ఆధునీకరణకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి నారాయణ, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి, సిడిఎంఏ హరినారాయణ, జెసి భార్గవ్ తేజ్, ఎమ్మెల్సీ పి అనురాధ, తాడికొండ ఎమ్మెల్యే టి శ్రావణ్‌కుమార్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.