అమరావతి: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్ విధానంపై అధ్యయనం చేశామన్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు. ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్టీసీని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే 200 వరకూ కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. వచ్చే మూడు నెలల్లో మరో 1200 కొత్త బస్సులు రోడెక్కేలా ఆర్డర్లు పెట్టామన్నారు. ఆర్టీసీ బస్సులకు చంద్రబాబు పెట్టిన అమరావతి బ్రాండ్ దెబ్బతీసేలా జగన్ డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో బస్సుల్ని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతో జగన్ నిర్వీర్యం చేసిన అమరావతి బ్రాండ్ బస్సులను తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.