విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు కాలిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల పడవలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో జీవనోపాధి కోల్పోయిన 49 మంది బాధితులు ఒక్కొక్కరికి ఆయన రూ.50వేల చొప్పున పరిహారం అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ‘‘ దగ్ధమైన బోట్ల యజమానులకు పరిహారం సరిగా అందడం లేదు. బోటు విలువలో 80 శాతం ఇస్తామన్నారు… ఇచ్చారా? మా ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు న్యాయం చేస్తాం. ఉన్న ఇళ్లు సరిపోవని జగన్ రుషికొండలో మరో ప్యాలెస్ కట్టుకున్నారు. రుషికొండలో ఖర్చు చేసిన డబ్బుతో మరో ఫిషింగ్ హార్బర్ కట్టొచ్చు. మన రాష్ట్రంలో ఒక్క జెట్టీ కూడా సరిగా లేదు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గుజరాత్‌లో మాదిరిగా ఇక్కడ కూడా జెట్టీలు కట్టుకుందాం. మరో నాలుగు నెలల తర్వాత మంచి రోజులు వస్తాయి. నాకు మద్దతుగా నిలవండి… మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’’ అని పవన్ హామీ ఇచ్చారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో ఈ నెల 19న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయిన విషయం తెలిసిందే.