అమరావతి (చైతన్య రథం): ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్రం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్ సిటీల్లో రాష్ట్రానికి చోటుదక్కేలా కృషి చేసింది. వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. కొత్తగా అభివృద్ధి చేసే 8 స్మార్ట్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం రూ.8వేల కోట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇప్పటికే 100 నగరాలు అభివృద్ధి చేశామన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్, వేగంగా సాగుతోన్న పట్టణీకరణకు అనువుగా 8 ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఈ పథకం కోసం 21 రాష్ట్రాల నుంచి 26 ప్రతిపాదనలు రాగా.. ఎనిమిదింటిని ఎంపిక చేసినట్టు వివరించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించిన 15వ ఆర్థిక సంఘం అందులో మెరుగైన ప్రణాళికలు పంపిన 8 రాష్ట్రాలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కొప్పర్తికి చోటు కల్పించినట్టు వివరించారు. ఐసీసీగా పరిగణించే నూతన స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల, పరిశుభ్రతకు పెద్దపీట వేయనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనతోపాటు పాలనాపరంగానూ అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన 100 స్మార్ట్ సిటీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, వైఫై, హాట్‌స్పాట్ సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూములు, డిజిటల్ లైబ్రరీలు సకల సదుపాయాలతో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దినట్టు కేంద్రం పేర్కొంది.