కాకినాడ (చైతన్యరథం): కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం నిల్వచేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన బృందం బుధవారం సముద్రంలో నిలిచిఉన్న నౌకలోకి వెళ్లి పరిశీలించింది. రేషన్ బియ్యం నమూనాలు సేకరించి నిజానిజాలను బృందం నిగ్గు తేల్చనుంది. నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భద్రత వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత ఐదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం నౌకను పరిశీలించింది.