- క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
- నలుగురికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
- బాధితులను పరామర్శించిన హోం మంత్రి అనిత, ఎంపీ రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల
అనకాపల్లి, అమరావతి: అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. పరవాడ.. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రాడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురికి గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమ బి-బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 కిలోలీటర్ల రియాక్టర్లో కెమికల్ నింపి చార్జింగ్ చేస్తుండగా రసాయనం ఒక్కసారిగా పొంగి పైకప్పునకు తగిలి కార్మికులపై పడిరది. ఈ ప్రమాదంలో రaార్ఖండ్‌కు చెందిన లాల్సింగ్, కోహర్, రోస, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణకు గాయాలయ్యాయి. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అనకాపల్లి ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పరామర్శించారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన గురించి, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో హోంమంత్రి అనిత ఇండస్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.