- ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్‌కు నేడు శంకుస్థాపన
- సిస్టమ్స్ సెంటర్‌నూ అభివద్ధి చేయనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమ
- జువ్వలదిన్నెలో ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
- మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి.. 750మందికిపైగా ఉపాధి
అమరావతి (చైతన్య రథం): భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు.. దేశ సముద్ర సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కీలకమైన ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్‌వద్ద ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటుకు నేడు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. భారతదేశ సముద్ర, రక్షణతయారీ పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుంది. అధునాతన సముద్ర సాంకేతికతను ప్రోత్సహించడంతోపాటు మత్స్యరంగాన్ని బలోపేతం చేయనున్నారు. స్వయం ప్రతిపత్తిగల మారిటైం షిప్ యార్డ్‌గా దీనిని అభివృద్ధి చేయనున్నారు. ఏపీ తీరప్రాంతంలో ఇండస్ట్రియల్ అండ్ స్కిల్స్ ఎకోసిస్టమ్‌ను ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేయనుంది. మెరుగైన తీరప్రాంత నిఘాతోపాటు తీర ప్రాంత భద్రత, రక్షణ సంసిద్ధతకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. దేశీయంగా రక్షణరంగ సాంకేతికత అభివృద్ధికి ఈ కేంద్రం మద్దతుగా నిలవనుంది.
మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి, 750 మందికిపైగా ఉద్యోగాల కల్పన
అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటుకు సాగర్ ఢిపెన్స్ సంస్థ మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 750 మందికిపైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మొదటి దశకింద 29.58 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రండ్ ల్యాండ్ కూడా ఉంది. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కేంద్రం ద్వారా షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో యువతకు 750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ముంబయి కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అన్‌మాన్డ్ మెరైన్ సర్ఫేస్ వెహికిల్స్ రంగంలో పేరుగాంచింది. ఈ సంస్థ భారత నౌకాదళం, ఐడెక్స్, ఇతర భద్రతా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. అటానమస్ మారిటైం షిప్ యార్డ్ అత్యాధునిక పారిశ్రామిక సదుపాయం. ఇది మానవరహిత, స్వయంప్రతిపత్తి కలిగిన ఉపరితల, నీటి అడుగున నౌకల నిర్మాణం, ఏకీకరణ పరీక్ష, అలాగే వాటి లైఫ్ సైకిల్ సపోర్ట్ కోసం రూపొందుతుంది. ఇందులో ఇంటిలిజెంట్ మారిటైం సిస్టమ్స్, సెన్సార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తారు. ఆధునిక నౌకాదళ కార్యకలాపాలకు షిప్ యార్డ్ కీలకం కానుంది. ఈ ప్రాజెక్ట్ బ్లూ ఎకానమీ, మారిటైం ఇన్నోవేషన్‌ను బలోపేతం చేయడంతోపాటు ఏపీని మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా నిలపనుంది.
లోకేష్ నెల్లూరు పర్యటన వివరాలు:
కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ శంకుస్థాపనకు మంత్రి లోకేష్ హాజరవుతారు. తొలుత మధ్యాహ్నం 12.30కు తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా 3.45కు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.












