- ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు మంజూరు
- ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధి
- బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం
- నేడు సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష
- రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగా బీసీ హాస్టళ్ల మరమ్మతులకు మరో రూ.20 కోట్లు మంజూరు చేశామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో 2026-27 బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన, చేపట్టబోతున్న పథకాలు, హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధులు రాబట్టడంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, 2025-26కు సంబంధించి రూ.20 కోట్ల మేర సాస్కి నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసిందన్నారు. ఈ నిధులను రాష్ట్రంలో 238 హాస్టళ్లలో మరమ్మతులకు వినియోగించనున్నట్లు తెలిపారు. రెండు నెలల కిందట రూ.60 కోట్ల సాస్కి నిధులు విడుదల చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ రూ.25 కోట్లను హాస్టళ్ల మరమ్మతుల కోసం విడుదల చేశామని, ఇలా ఏడాదిలో రూ.105 కోట్లను హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి వెచ్చించామన్నారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ రుచికరంగా అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కుక్ లు, కమాటీలను నియమించామన్నారు. సన్న బియ్యంతో బీసీ బిడ్డలకు రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు.
నేడు సీఎం చంద్రబాబుతో సమీక్షా సమావేశం
రాబోయే బడ్జెట్ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పథకాల అమలు, అభివృద్ధి పనులపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ సమావేశంలో బీసీల అభ్యున్నతికి అవసరమైన నిధులు రాబట్టడానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల రోజుల సమయం ఉందని, ఈ ఏడాది నిధుల విడుదల విషయమై సీఎం చంద్రబాబుకు వివరించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమానికి అమలు చేసిన పథకాలను, బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
`















