అమరావతి (చైతన్య రథం): ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాధను నియమిస్తూ రాష్ర ్టప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ బాధ్యతల్ని రిటైర్డ్ పోలీస్ అధికారిణి ఏఆర్ అనురాధకు అప్పగించింది. కొద్దిరోజులుగా మరికొందరు ఉన్నతాధికార్ల పేర్లు కూడా బలంగా వినిపించినా.. ప్రభుత్వం ఏఆర్ అనురాధ వైపు మొగ్గుచూపింది. తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోనూ పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు సైతం ఐపీఎస్సే. ఏపీపీఎస్సీ బాధ్యతలను అప్పగించే విషయంలో పలు పేర్లను పరిశీలించిన ప్రభుత్వం అనురాధ నియామకానికి మొగ్గు చూపింది. ఈమేరకు ఫైలును సిద్ధంచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు ప్రాథమిక సమాచారం. ఏఆర్ అనురాధ నియామకానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సుముఖత తెలపడంతో ఆమె నియామకం లాంఛనమైనట్లు తెలుస్తోంది.