- పౌర సేవలన్నీ ఒకే యాప్‌లో
- అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి
- ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి
- ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాలి
- డ్రోన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి
- ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు వివిధ ఐటి కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రయ్నతాలు చేయాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఇతర ఎడ్యుకేషన్ సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న స్టార్టప్‌లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ, టెస్టింగ్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని ఆదేశించారు.
పూర్తిగా అందుబాటులోకి సీసీ కెమెరాలు
పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు ఒక యాప్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించి కొంత వరకూ మెరుగైన సేవలను అందిస్తోందని చెప్పారు. పౌరులకు సంబంధించి పలు రకాల సేవలందించడంలో లాజికల్ కన్‌క్లూజన్‌కు రావాలన్నదే తన ఆలోచన అని, ఆ దిశగా వెంటనే కసరత్తు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఆర్‌ఎం సంసిద్ధత వ్యక్తం చేయగా, ఆర్టిఫిషియల్-డేటా సెంటర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో రిలయెన్స్ సంస్థ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సైబర్ సెక్యురిటీకి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ, ఏ ఘటన జరిగినా గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా సీసీ కెమెరాలు పూర్తిగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఐటీ అభివృద్ధికి చర్చలు: లోకేష్
రాష్ట్ర మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ అండ్ ఆర్టీజిఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ…రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ విధానంలో ప్రజల సమస్యలను స్ట్రీమ్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐటి-ఎలక్ట్రానిక్స్ రంగంలో మెరుగైన అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.