- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
- నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం
- నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
- సూపర్స్ సిక్స్ సహా పలు రంగాలకు భారీ కేటాయింపులు
- 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్: రూ.2,94,427.25 కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు.
- రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు
- ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపుదిద్దుకుంది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా.. ఏపీ బడ్జెట్‌లో వివిధ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది.. నాలుగు నెలల కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ ఆమోదంతోపాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసంతో తిరోగమనంలోకి పోయిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి సాధారణ స్థాయికి తీసుకొచ్చేలా 2024-25 బడ్జెట్‌ను ప్రకటించింది ఎన్డీయే ప్రభుత్వం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రాధాన్యతా ప్రాతిపదికన కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు.
రాష్ట్ర జీఎస్డీడీపీలో 40 శాతానికిపైగా వాటావున్న వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43,402 కోట్లు కేటాయించడం ద్వారా మాది రైతు సంక్షేమ ప్రభుత్వమన్న పేరుకు సార్థకత చేకూర్చారు. విద్య, వైద్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధితో పాటు రాష్ట్ర రహదారుల కోసం సింహభాగం ఖర్చు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగానే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉండటం గమనార్హం.
2024- 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తెచ్చారు మంత్రి కేశవ్. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడిరచారు.
తల్లికి వందనం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తర్వాత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పరిస్థితి.. ఎదుర్కొంటున్న సవాళ్లను ముందుగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి.. చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడిరదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రతికూలంగా వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ.. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందన్నారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పున:ప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం ఇప్పుడు నేటితరం చేతుల్లో ఉందంటూనే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేరణే చోదక శక్తిగా చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశాన్ని ఆర్థిఖ మంత్రి పయ్యావుల కేశవ్ సందర్భోచితంగా ప్రస్తావించారు.
‘‘ప్రతీ సంక్షోభాన్నీ అంకితభావంతో, సృజనాత్మకతతో నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి’’
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగ పాఠం యథాతథంగా….
గౌరవనీయ అధ్యక్షా!
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మన రాష్ట్ర వార్షిక బడ్జెటును మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను.
ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీరును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన ఏడు శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్ నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశ్యం. ఈ రోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళు:
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం
రాష్ట్ర వనరుల మళ్ళింపు
లోపభూయిష్టమయిన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజవనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం
ప్రభుత్వ పన్నులను దారి మళ్ళించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం
పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్ళింపు
పిల్లల పౌష్టిక ఆహారం కోసం చిక్కి, వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపుల నిలుపుదల
స్థానిక సంస్థల నిధుల మళ్ళింపు
ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు
వివిధ పనులకు చెందిన బిల్లుల బకాయిలు
అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగ పతనం
ఇంధన రంగ విధ్వంసం
కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్ళింపు
పైన పేర్కొన్న కారణాల వలన దేశంలోనే తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పున:ప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్ నిర్మించడం ఇప్పుడు నేటితరం చేతులలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా ఆయన మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను.
‘‘ప్రతీ సంక్షోభాన్నీ అంకితభావంతో, సృజనాత్మకతతో నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి.’’
2024 మే-జూన్ నెలలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు. 57 శాతం ఓట్లతో, 175 సీట్లకుగాను 164 సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం. అసాధారణమైన ఆధిక్యతతో 93 శాతం సీట్లను మేము గెలవగలిగాము. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది. అదే సమయంలో, మా ఎన్డీయే ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం.