- నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అవసరం
- యువత జాబ్ క్రియేటర్స్‌గా తయారయ్యేలా ప్రోత్సహం
- నవీన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి
- ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొన్న మంత్రి
అమరావతి(చైతన్యరథం): రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. అమరావతిలోని విట్ (విఐటీ) యూనివర్సిటీ ప్రాంగణంలో విట్ ` ఏపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను మంత్రి లోకేష్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన అధునాతన డ్రైవర్ లెస్ వ్యాన్, డ్రోన్, రోబో వంటి నవీన ఆవిష్కరణలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ… యువత ఉద్యోగం సాధించే విధంగా కాకుండా, ఉద్యోగాల సృష్టికర్తలుగా తయారుకావాలని పిలుపు ఇచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్టార్టప్‌లను ప్రారంభించాలన్నారు. ఇందుకు ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తుందని, రూ.250 కోట్లతో సీడ్ ఫండ్‌ను కూడా ఏర్పాటుచేశామని చెప్పారు. విశాలమైన ఆలోచనా దృక్ఫథంతో ముందుకుసాగుతూ యువత తమ కలలను సాకారం చేసుకోవాలని అభిలషించారు. నైతిక విలువలతో కూడిన విద్యావ్యవస్థను తయారుచేయడమే మా లక్ష్యం. రాబోయే పాతికేళ్లు భారత్ యుగం. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పునరావిష్కరణలపై దృష్టిసారించాలి. అవుట్ పుట్స్ పై కాకుండా అవుట్ కమ్స్‌పై విట్ వంటి విద్యా సంస్థలు శ్రద్ధ వహించాలని మంత్రి లోకేష్ సూచించారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
జీవితంలో గెలుపే ఏకైక లక్ష్యంగా యువత ముందుకు సాగాలి. అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ నవీన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. స్టాన్ ఫోర్డ్‌లో ఎంబీఏ చేశాక 2005లో నేను ప్రపంచబ్యాంకులో పనిచేశాను. అందరి లాగానే నేను కూడా ఒడిదుడుకులను చవిచూశాను. 2017లో రాష్ట్రమంత్రిగా ఎంతో అభివృద్ధి చేశాను. 1985 తర్వాత ఎప్పుడూ గెలవని మంగళగిరిలో 2019 ఎన్నికల్లో నేను పోటీచేశాను. మంగళగిరి ప్రజలు నన్ను 5300 ఓట్లతో ఓడిరచారు. రెండు, మూడు రోజులు బాధపడ్డా. తర్వాత ఐదేళ్లు ప్రజలకు అండగా నిలబడ్డాను. ఇటీవల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు. యువత కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ లక్ష్యసాధన కోసం ముందుకు సాగాలి. అందుకు నన్ను ఉదాహరణగా తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరేందుకు యువత ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలని మంత్రి లోకేష్ హితవు పలికారు.
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ చీకటిరోజులను చవిచూసింది. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వాన మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 150రోజులుగా అభివృద్ధి పట్టాలెక్కింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికి కట్టుబడి పనిచేస్తున్నాం. అమరావతిని సకల సౌకర్యాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. రాబోయే పాతికేళ్లలో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంగల రాష్ట్రంగా తయారుచేస్తాం. 1980-90 దశకాల్లో వచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి. అందులో భాగంగా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని చంద్రబాబునాయుడు సైబరాబాద్‌ను నిర్మించారు. ఫలితంగా ఈరోజు భారత సాఫ్ట్ వేర్ రంగంలో 20శాతం మంది తెలుగువారే ఉన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలైన మైక్రో సాఫ్ట్, గూగుల్, అడోబ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల్లో భారతీయులు కీలకస్థానాల్లో ఉన్నారు. చైనా, అమెరికా, జపాన్ మోడల్‌ను కాకుండా భారత్ మోడల్ విద్యావ్యవస్థను ఇతర దేశాలు అనుసరించే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
బలమైన విద్యావ్యవస్థకు కలసి పనిచేద్దాం
ఏపీ విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలతో కనెక్ట్ చేయడానికి విట్ `ఏపీ వేదికను అందించడం అభినందనీయం. అమరావతికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ యూనివర్సిటీల ప్రతినిధులు రావడం హర్షణీయం. యువత ఆకాంక్షలకు మద్దతుగా నవీన ఆవిష్కరణలు, పరిశోధనలు, అకడమిక్ ఎక్సలెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేలా బలమైన విద్యావ్యవస్థ నిర్మాణానికి కలిసి పని చేద్దాం. ఈ ఈవెంట్ ద్వారా ఏపీ విద్యార్థులు సాధించే విజయ గాథల కోసం నేను ఎదురు చూస్తాను. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వాములైన అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు
మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా భారత్‌లో విద్యారంగ బడ్జెట్ పెరగాల్సిన అవసరం ఉందని విట్ ఏపీ చాన్స్‌లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కేంద్రబడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 2.9శాతం మాత్రమే కేటాయించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యారంగానికి 4నుంచి 6శాతం వరకు ఖర్చుచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విట్ – ఏపీ వ్యవస్థాపకుడు జి. విశ్వనాథన్, వైస్ చాన్సలర్ ఎస్.వి. కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర మురుగన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోఆర్డినేటర్ గోస్వామి, ప్రొఫెసర్ రీతు వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.