- ఐదేళ్లు గంజాయి మత్తులో రాష్ట్రాన్ని ముంచిన వైసీపీ
- యువత, మహిళల భవిష్యత్తును గంజాయి, డ్రగ్స్‌కు బలిచ్చిన వైసీపీ
- చంద్రబాబు పాలనలో యువతకు, మహిళలకు స్వర్ణయుగం
- రామకుప్పం మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్యలు
రామకుప్పం (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం చీకట్లో మగ్గిపోయిందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంతో రాష్ట్రంలో వెలుగు వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు గురువారం రామకుప్పం గ్రామంలో పర్యటించారు. రామకుప్పం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలిందన్నారు. ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. మహిళలకు రక్షణ లేకుండాపోయింది…మహిళలు స్వేచ్ఛగా బ్రతికిందే లేదు. వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకునేందుకు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకు అడ్డాగా మార్చారు. రాష్ట్ర యువత భవిష్యత్తును మత్తు పదార్థాలకు బలిపెట్టి, వైసీపీ నేతలు తమ స్వార్థం చూసుకున్నారు. అందుకే రాష్ట్రమంతా ఏకమై రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.
చంద్రబాబుపై కుప్పం ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం. చంద్రబాబును కుప్పం ప్రజలు వరుసగా 8సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు. చంద్రబాబు చేసేదే చెబుతారు….చెప్పిందే చేస్తారు…ఈ విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మా కుటుంబంపై మీరు పెంచుకున్న అభిమానం, చంద్రబాబుపై మీరు పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుంది. కుప్పం మహిళలు 2024 ఎన్నికల్లో రోడ్లపైకి వచ్చి ధైర్యంగా నిలబడి పార్టీని, చంద్రబాబును గెలిపించుకునేందుకు కష్టపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, భయపెట్టినా వాటిని ఎదురించి నిలబడ్డారు. కుప్పం మహిళల త్యాగాలు, ధైర్యానికి నా ధన్యవాదాలు. కుప్పం మహిళలకు ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతానని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
భువనమ్మకు రామకుప్పం ప్రజలు ఘన స్వాగతం
రామకుప్పం పార్టీ కార్యకర్తలు, గ్రామస్ధులు తమ గ్రామానికి వచ్చిన భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభాలతో మహిళలు స్వాగతం పలికారు. గజమాల వేసి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవాయిద్యాలతో ఓ పండుగ వాతావరణంలో భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభంలో వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి భువనమ్మ నివాళులు అర్పించారు.