అమరావతి: రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు మృతిచెందడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం ఆవేదన కలిగించింది. మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పేద కుటుంబాలకు చెందిన వీరిని ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. బాధితులకు తగినంత నష్ట పరిహారం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఉపాధి కోసం కూలీలు కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.