జీవో నంబరు 1 కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం
చీకటి చట్టంతో చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో అర్థం లేని ఆంక్షలు
జీవో కొట్టివేతతో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ
చీకటి చట్టంపై కోర్టును ఆశ్రయించిన కొల్లు రవీంద్ర, సీపీఐ రామకృష్ణ, కన్నా లక్ష్మీనారాయణ
వ్యాఖ్యలు విచారించి తుదితీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం
ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా వున్న జీవో నంబరు 1ని హై కోర్టు కొట్టివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ గానే భావించవచ్చు. ప్రభుత్వ ఏకపక్ష పోకడలు, ప్రశ్నించే వారిని నియంత్రించాలన్న అహంకార పూరిత ధోరణులకు హై కోర్టు తీర్పు ‘ చెక్ ‘ పెట్టినట్టయింది. ఈ జీవో రాజ్యాంగ ప్రసాదిత పౌర హక్కులకు భంగం కలిగించేదిగా వున్నందున కొట్టి వేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రముఖులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లతో పాటు తెలుగుదేశం పార్టీ లో చేరక ముందు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో పాటు పలువురు ప్రముఖులు హై కోర్టులో వేర్వేరుగా వ్యాఖ్యలు దాఖలు చేశారు. వారి వ్యాఖ్యలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ను రిజర్వ్ చేసి శుక్రవారం వెలువరించింది.
హై కోర్టు తీర్పు పట్ల ప్రజాస్వామిక వాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను దృష్టిలో వుంచుకొనే అధికార పార్టీ జీవో నంబరు 1 తీసుకు వచ్చిందని ఆరోపణలు వున్నాయి. అందుకు అనుగుణంగానే పోలీసు యంత్రాంగం సైతం చంద్రబాబు, లోకేష్ ల పర్యటనలలో అర్థంలేని ఆంక్షలతో చెలరేగిపోయింది.
చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో పోలీసు యంత్రాంగం ఈ జీవోను అడ్డుపెట్టుకొని అత్యుత్సాహం ప్రదర్శించింది. చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. చంద్రబాబు వెళ్ళే మార్గం లో ఆయనను నిలువరించేందుకు, వాహనం వెళ్ళే వీలులేకుండా భారీ వాహనాలు రోడ్డుగా పెట్టడం, పోలీసులే బైటాయింపు జరపటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అయితే చంద్రబాబు పట్టువదలకుండా దాదాపు 8 కిలోమీటర్ల దూరం కాలినడకన సభా స్థలికి చేరుకున్నారు. అయితే అక్కడ సైతం చంద్రబాబు సభ జరుగకుండా చివరి వరకూ విశ్వ ప్రయత్నాలు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం, జనరేటర్ ను ఆపివేసి తాళాలు వేయటం వంటి చర్యలకు పాల్పడ్డారు.
చంద్రబాబు ప్రసంగించే సమయంలో ఆ ప్రచార వాహనం పైకి ఎక్కి మైకు ను తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రజా చైతన్యం వెల్లివిరిసి తిరగబడడం తో చంద్రబాబు సభను నిలుపుదల చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. అదే సభలో సహాయ నిరాకరణ పాటించాల్సిందిగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జీవో నంబరు 1 అడ్డుగా పెట్టుకొని పోలీసులు అడుగడుగునా ప్రతిబంధకాలు సృష్టించారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేయటం, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకపోవడం, లోకేష్ మాట్లాడిన మైకును స్వాధీన పరచుకోవటం వంటి చర్యలకు పాల్పడ్డారు. చివరకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజాసమూహానికి కనిపించేందుకు లోకేష్ నిలబడిన చిన్న స్టూలు ను సైతం లాగివేయటం పోలీసు చర్యలకు పరాకాష్ట గా నిలిచింది.
అయితే జన సునామీని తలపించే విధంగా సాగుతున్న పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర గా మారగలదని లోకేష్ చేసిన హెచ్చరికలతో పోలీసు దూకుడు కొంతమేర తగ్గింది. రాష్ట్ర హై కోర్టు తాజాగా ఈ జీవో ను కొట్టివేయటంతో చంద్రబాబు, లోకేష్ ల పర్యటనలు ఆంక్షల చట్రం లో ఇరుక్కోకుండా స్వేచ్చగా జరిగేందుకు మార్గం సుగమమైంది.