- దేశంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ బీపీసీఎల్
- రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు సిద్ధం
- ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో దిట్ట విన్ ఫాస్ట్
- రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధులు
- అనువైన భూములు ఇస్తాం.. అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ
అమరావతి (చైతన్యరథం): పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బీపీసీఎల్, వియత్నాం దేశానికి చెందిన విన్‌ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. చంద్రబాబు ఇటీవలి తన ఢల్లీి పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా బుధవారం బీపీసీఎల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిథులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అససరమైన భూములు కేటాయిస్తామని…90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో వియత్నాంలో పేరున్న సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ తో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామని…పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. అంతకు ముందు బీపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: చంద్రబాబు
సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలోని తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మన రాష్ట్రం గణనీయమైన పెట్రో కెమికల్ సామర్థ్యాలను కలిగి ఉందని తెలిపారు. ఏపీలో దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 5వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. అందుకే, 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సంస్థ ప్రతినిధుల్ని కోరా. ఇబ్బంది లేని పద్ధతిలో ఆ సంస్థకు సౌకర్యాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఐదేళ్ల నుండి అభివృద్ధి అనే మాట కూడా వినపడకుండా విధ్వంసపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాలేక పోగా, ఉన్న పరిశ్రమలను కూడా తరిమేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక, వారి నాయకులకు కప్పం కట్టలేక ఏపీ నుండి గత ఐదేళ్లుగా ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. అందులో జాకీ, అమర్ రాజా, లూలూ.. ఇలా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి. అభివృద్ధి లేక పోగా రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారింది. 2019లో ఒక్కఛాన్స్ అంటూ వచ్చిన జగన్‌ను నమ్మి నిండా మునిగిన రాష్ట్ర ప్రజలు, అభివృద్ధి ప్రదాత చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు, ఇటీవలి ఎన్నికలలో పార్టీల తలరాతలు తలకిందులు చేస్తూ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పెట్టుబడుల వేటలో పడ్డారు. ఆయన కృషి ఫలించి బీపీసీఎల్ సంస్థ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది.