గ్రామపంచాయతీ లలో అభివృద్ధి అడుగంటింది. టిడిపి హయాంలో పండుగ వాతావరణంతో కళకళ లాడిన పంచాయతీలు ప్రస్తుతం నిధుల లేమితో వెలవెల బోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్ర పరిస్థితి గ్రామాలలో నెలకొని వున్నది. పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన నిధుల కేటాయింపులు యధావిధిగానే జరుగుతున్నాయి. అయినా ఆ నిధులు దారి మళ్ళటంతో పల్లె కు కష్టం వచ్చింది. సకాలంలో నిధులు వ్యయం చేయకపోవటం లేదా అధికారంలో వున్నా వారు దుర్వినియోగం చేయటం వంటి కారణాలతో అభివృద్ధి మసకబారుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే పంచాయతీల పట్ల విలన్ లా మారిన విచిత్ర పరిస్థితి నెలకొని వున్నది.
గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, అవి అందుబాటులో లేకపోవటం అన్నది ప్రభుత్వ కృత్రిమ చర్యల కారణంగానే నని చెప్పవచ్చు. ప్రభుత్వ అవసరాలకు పంచాయతీ నిధులు వాడుకోవడంతో మూడున్నరేళ్ళకు పైగా ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ జరుగలేదు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్దే నేటికీ కానవస్తోంది..టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంఘం నిధులు వ్యయం తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) క్రింద పెద్ద ఎత్తున పనులు జరిగాయి. దీనివల్ల గ్రామాలు అభివృద్ధి చెందటంతో పాటు అత్యధిక శాతం మందికి ఉపాధి లభించింది. అయితే ప్రభుత్వం మారాక ఆ పనులకు బిల్లులు చెల్లించక పోవటంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చివరకు హై కోర్టు ఆదేశాలతో, అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించాల్సి వచ్చింది. టిడిపి హయాంలో గ్రామాలలో పనులు e స్థాయిలో జరిగాయనటానికి ప్రభుత్వం చెల్లించిన బిల్లులే సాక్ష్యం. 2014 నుంచి 2019 వ సంవత్సరం లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ప్రతి ఏటా ఆర్ధికసంఘం కేటాయింపులు ఏటేటా పెరుగుతూ వచ్చాయి. మొత్తం అయిదు సంవత్సరాల చంద్రబాబు పదవీకాలంలో రో.6,667.34 కోట్లు విడుదలయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కోసం మరో రూ. 24,717 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా కేటాయింపులను పెంచుతూ వచ్చింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ దాదాపు 26 వేల కిలోమీటర్ల పొడవునా పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా నిధుల కేటాయింపు యధావిధిగా జరిగింది. టిడిపి హయాంలో లో కంటే అధికంగా నిధుల బదలాయింపు జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక సంఘం నిధుల రూపంలో రూ..7,659 కోట్లు, నరేగా పథకం క్రింద రూ. 25,477 కోట్లు కేటాయించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే టిడిపి అయిదేళ్ల కాలం కంటే అధికంగా ప్రస్తుత ప్రభుత్వానికి నిధులు విడుదలయినట్టు స్పష్టం అవుతోంది. ఒక వైపు అధికంగా నిధులు విడుదల కావటం మరోవైపు ఆ నిధులు మా ఖాతాల నుంచి మాయమయ్యాయి అని గ్రామ సర్పంచ్ లు చెప్పటంతో ఆర్ధికసంఘం, నరేగా పథకం క్రింద నిధుల కేటాయింపు ఉద్దేశం దెబ్బతిన్నది. దీనిపై పలువురు సర్పంచ్ లు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తమ ఖాతాలలో నిధులు మాయమైనందున సైబర్ క్రైమ్ క్రింద కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన చోటుచేసుకుంది. దేశంలో మరే రాష్ట్రం లోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ల పరిస్థితి దయనీయంగా మారింది.