- క్రీడా వసతులు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వం శ్రద్ధ
- క్రీడాంధ్రప్రదేశ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం
- యూనివర్సిటీల్లో ఉత్తమ క్రీడాసౌకర్యాలు
- జాతీయ పోటీల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
గుంటూరు (చైతన్య రథం): క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఏపీ సీనియర్ అండ్ జూనియర్, క్యాడెట్ స్టేట్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలను ఇంటర్ నేషనల్ జూడో ఫెడరేషన్ రిఫరీ ఉమేష్ కుమార్ సింగ్‌తో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు శుక్రవారం ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని జ్యోతి ప్రజ్వలన చేసి జూడో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ ఖేలో ఇండియా గేమ్స్, ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయా పోటీలను నిర్వహించేందుకు యూనివర్సిటీల్లో సైతం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడావసతులు కల్పిస్తుందని వెల్లడిరచారు.
అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రా క్రీడాకారులు రాణించాలనేది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని, దానికి అనుగుణంగా విద్యామంత్రి నారా లోకేష్ స్కూల్‌స్థాయి నుంచే క్రీడాకారులను తయారు చేసే విధంగా ప్రత్యేక ప్రణాళికలు, జీవోలు తీసుకొచ్చారన్నారు. క్రీడాకారుల ప్రయోజనార్థం కేవీకేలు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, స్పోర్ట్స్ ఎరీనాల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. నేషనల్స్ ఆడిన క్రీడాకారులందరికీ యూనిఫాం జాబ్స్ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించాలని, తమకు కావాల్సిన క్రీడావసతులను కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక దృషి సారిస్తుందని వివరించారు. క్రీడాకారుల భవిష్యత్యే ధ్యేయంగా శాప్ పని చేస్తుందదన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాల్‌కుమార్, ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.