2013 జూన్‌లో చార్‌ధామ్ యాత్రలకెళ్లి వరదల్లో చిక్కుకుని తిండి, నీళ్లులేక తెలుగు యాత్రికులు అలమటించారు. నాడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నారు. ఆ సమయంలో కేవలం ప్రభుత్వంపై విమర్శ చేసి కూర్చోలేదు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ బాధితుల క్యాంపునకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ 9 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. పార్టీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినా చంద్రన్న ప్రత్యేక విమాన ఖర్చు భరించి 186మంది తెలుగు యాత్రికులని డెహ్రాడూన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. నారా లోకేష్ విమానాశ్రయానికి చేరుకున్న బాధితులకు స్వాగతం పలికి, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చారు. లక్షల కోట్ల ఆస్థి కలిగిన నేటి ప్రతిపక్ష నేత జగన్ వరద బాధితులకు సహాయం చేయకపోగా, కంటిమీద కునుకు లేకుండా బాధితుల్ని ఆదుకుంటున్న చంద్రబాబుపై, అయన నివాసంపై, అమరావతిపై విషం కక్కుతున్నారు.
2022 మార్చిలో యుద్ధం వలన ఉక్రెయిన్లో 1481 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకునిపోయారు. చంద్రన్న ప్రతిపక్షనేతగా జగన్ ప్రభుత్వంపై విమర్శలకు పరిమితం కాలేదు. టీడీపీ ఎన్నారై విభాగం ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన 1481మంది విద్యార్థుల వివరాలను సేకరించి కేంద్ర మంత్రి జై శంకర్‌కు పంపారు. తెలుగు విద్యార్థులు రాష్ట్రాలకు చేరేవరకు కృషి చేశారు.
2022 జులైలో గోదావరి వరదల్లో వందకుపైగా లంక గ్రామాలు జల దిగ్బంధానికి గురయ్యాయి. ప్రజలకు తిండి లేదు. తల దాచుకోవడానికి చోటు లేదు. మూడు రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాదిమంది అంధకారంలో బిక్కుబిక్కున బతికారు. అధికారుల జాడ లేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరిగి వెళ్లిపోయాడు. వరద బాధితులకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలిస్తే.. జగన్ ఇచ్చింది కేవలం రూ.2 వేలు మాత్రమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధిత ప్రజల వద్దకెళ్లి ధైర్యం చెప్పారు. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు వరద బాధితులకు లక్షల రూపాయల విలువ చేసే ఆహారం, కూరగాయలు, వస్త్రాలు, త్రాగు నీరు అందించారు. జగన్‌రెడ్డి వాలంటీర్లు వున్నా గోదావరి వరద బాధితులకు సహాయం అందించలేదు.
2019 సెప్టెంబర్‌లో గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద పారే సమయంలో వైకాపా నేతల ప్రోధ్భలంతో బోటు యాత్రకు జగన్ ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారు. వరద ఉధృతికి కచ్చులూరి వద్ద బోటు బోల్తా పడి 39మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ చర్యలు వారాల తరబడి జాప్యం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ గాల్లో ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయాడు. ఈయన నేడు విజయవాడ వరదలపై చంద్రబాబుపై విషం కక్కుతున్నాడు.
2018 అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుఫాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. చంద్రన్న నిద్రాహారాలు మాని తుఫాను బాధితులకు సహాయమందించేందుకు పని చేశారు. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగాన్ని కదిలించి బాధితుల్ని శరవేగంగా ఆదుకున్నారు.
2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ దెబ్బకు విశాఖ నగరం పూర్తిగా ధ్వంసమైంది. 200 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. కరెంట్ లేదు. ఫోన్లు పని చేయలేదు. ప్రజలు ఇళ్లల్లోనే బందీలయ్యారు. 1904వ సంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా తుఫానులురాగా వాటన్నింటిలోకి భయంకరమైనది హుద్‌హుద్ తుఫాను. ఈ విపత్తుని జయించటానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 9 రోజులపాటు విశాఖలోనే మకాం వేసి పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చారు. విశాఖను పునర్నిర్మించారు.
2009లో తుంగభద్ర వరదలకు కర్నూలు దెబ్బతింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్క రోజులోనే ముప్పైవేల మంది బాధితులకు సాయం అందించారు. నాటి ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేయలేదు. నిర్మాణాత్మక సూచనలు చేశారు.
2001లో గుజరాత్, మహారాష్ట్ర భూకంప బాధితులకు చంద్రబాబు ఇతోధిక సాయం అందించారు.
1996 ఒరిస్సా తుఫాను బాధితుల్ని చీకట్లోనుంచి వెలుగులోకి తేవడానికి చంద్రబాబు ప్రభుత్వం మన విద్యుత్ ఉద్యోగుల్ని పంపి అక్కడి విద్యుత్ వ్యవస్థని పునరుద్ధరించింది.
చంద్రబాబు ఆపధ్భాంధవుడు -బాధితుల్ని ఆదుకునేందుకు ఆయనకు వయస్సు అడ్డంకికాదు. నిద్రాహారాలు లెక్క చేయరు. బాధితుల్ని ఆడుకోవడానికి ఉదారంగా సహాయం చేస్తారు. ప్రభత్వాధినేతగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంతో సరిపుచ్చుకోరు. ప్రతిపక్షంలో ఉన్నా అదేతీరుతో ఆదుకుంటారు. ఆయనే కాదు ఆయన శ్రీమతి భువనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నమయ్య డ్యామ్ బాధిత కుటుంబాలని ఆదుకుంది. గోదావరి వరదల సమయంలోను ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలందించింది.
తండ్రి బాటలో తనయుడు లోకేష్ కూడా ఆపన్నులను ఆదుకోవడంలో ఆదర్శంగా వున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నకిలీ ఏజెంట్ల చేతిలో చిక్కుకుని దుర్భర జీవితం గడుపుతున్న వారిని లోకేష్ కాపాడుతున్నారు. దుబాయ్‌లో చిక్కుకుని నరకం చూసిన అంబేద్కర్ కోనసీమ జిల్లావాసి వీరేంద్ర తనను రక్షించాలని ఏపీ మంత్రి లోకేష్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌ద్వారా వేడుకున్నారు. మంత్రి లోకేష్ చొరవతో బాధితుడు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని లోకేష్ స్వస్థలాలకు చేరుస్తున్నారు. కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివను, ఒమన్‌లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళకు సైతం వారి స్వస్థలాలకు రప్పించ్చేందుకు సహాయం చేసి మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.
ఆపన్నులకు ఆచరణాత్మక సహాయం చేయకపోగా విష ప్రచారాలు, శవ రాజకీయాలు, కుట్రలు చేసే జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి మరింత గురికాక తప్పదని గుర్తుంచుకోవాలి.
గురజాల మాల్యాద్రి
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్