- కూటమిలో బీజేపీ భాగస్వామ్యం పట్ల అపోహలు పటాపంచలు
- ముస్లింలు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్‌లో బీజేపీ ఘనవిజయం
- కర్నూలు, గుంటూరు ఈస్ట్, కడప, నంద్యాలలో టీడీపీ భారీ విజయం
- ముస్లింలు ఎక్కువగా ఉన్న 40 స్థానాల్లో 38 కూటమి కైవసం
- పులివెందుల, పుంగనూరులో మాత్రమే గెలిచిన వైసీపీ
అమరావతి (చైతన్య రథం): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ `బీజేపీ -జనసేన కూటమి ప్రభంజనం ఒక చారిత్రక విజయం. ఎన్నికల్లో ప్రజల తీర్పుద్వారా వెల్లడయ్యే ఒక మహాసందేశం అనే పర్వంలో పలు ఇతర సందేశాలు అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. అలాంటి ఒక ఉపపర్వమే… ముస్లిం మైనారిటీలు తమ ఓట్లద్వారా వెల్లడిరచిన మనోభిప్రాయం.
తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రతిపాదన జరిగినప్పుడు భిన్నాభిప్రాయాలు కొంతమేరకు వ్యక్తమయ్యాయి. అలాజరిగితే ముస్లిం మైనారిటీల ఓట్లు కొంతమేరకు కూటమి కోల్పోవచ్చు అనే సందేహాలు వెల్లడయ్యాయి. దీనిపై కొనసాగిన చర్చ రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా టీడీపీ అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించింది. కానీ… ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, భద్రతపట్ల తెలుగుదేశం నిబద్ధతను ఆవర్గం గుర్తించి కూటమికి ఈ ఎన్నికల్లో అండగా నిలబడతారన్న ధీమాతో టీడీపీ నాయకత్వం కూటమి ఏర్పాటువైపు ముందడుగు వేసింది. జూన్ 4న జరిగిన ఓట్ల లెక్కింపులో కూటమి ప్రభంజనం కొనసాగి 164 శాసనసభా స్థానాల్లో విజయభేరి మోగించి చరిత్ర సృష్టించింది.
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఒకేతీరున నిశబ్ధంగా మార్పు కోరుతూ జగన్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు అనంతరం ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శాసనసభ స్థానాల్లో కూటమి విజయాలు ఈ విషయాన్ని ఠూఢీ చేశాయి. ఏకులంవారైనా, ఏమతంవారైనా వారి ఆశలు, ఆకాంక్షలు ఒకేతీరున ఉంటాయని… గత ఐదేళ్ల పాలనలో వారికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో వారి మెరుగైన జీవితం కోసం, వారి పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఒకేతీరున స్పందిస్తారని, ఆమేరకు ఒకేరీతిన ఓట్లువేసి, వారికి నమ్మకం ఉన్న పార్టీని, నాయకుడిని గెలిపించుకుంటారని ఈ ఎన్నికలు నిరూపించాయి.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 33 వేలకు పైగా ముస్లిం జనాభావుంటే ఆ సీటును బీజేపీకి కేటాయించడంపై పలు అనుమానాలు, ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. 47 వేలకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి వైఎస్ చౌదరి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
అదేవిధంగా ముస్లింలు అధిక సంఖ్యలోవున్న కర్నూలు, గుంటూరు ఈస్ట్, నంద్యాల, రాయచోటి, కడపవంటి స్థానాల్లో గెలవడం… ఈ ఎన్నికల్లో ప్రజలు మతాలకు అతీతంగా తీర్పునిచ్చారన్న విషయాన్ని స్పష్టం చేశాయి.
ముస్లింలు ఎక్కువగా ఉన్న సీట్లలో కూటమి స్వీప్
రాష్ట్ర శాసనసభలోని 175 స్థానాల్లో జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉండి ఎన్నికల ఫలితాలను ముస్లింలు ప్రభావితం చేయగలిగిన 40 స్థానాలున్నాయి. వాటిలో 38 స్థానాలను కూటమి గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అధికార వైసీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీని బూచిగా చూపి ముస్లిం మైనారిటీలను కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసేలా చూడటానికి జగన్‌రెడ్డి శిబిరం అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమైంది. ఇతర వర్గాల ప్రజల మాదిరిగానే మైనారిటీలు కూడా గత ఐదేళ్ల జగనాంధకారానికి చరమగీతం పలికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో తమ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలని బలంగా కోరుకోవడంతో జగన్‌రెడ్డి కుట్రలు భగ్నమయ్యాయి.
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు శాసనసభ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకిదించి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. టీడీపీ పోటీలోకి దించిన ముగ్గురు ముస్లిం అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. విశేషమేమంటే వైసీపీ ముస్లిం అభ్యర్థులు పోటీ చేసిన ఏడుస్థానాల్లో ఆరుచోట్ల జనాభాపరంగా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఏడు స్థానాల్లో కూటమి ఐదుచోట్ల ముస్లిమేతరులను బరిలోకి దించి మొత్తం ఏడుస్థానాలను గెలుచుకోగలిగింది. ఈ ఏడుస్థానాలు… విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, నెల్లూరు సిటీ, కడప, కర్నూలు, కదిరి, మదనపల్లె వీటిలో గుంటూరు ఈస్ట్, మదనపల్లెలో టీడీపీ తరుపున ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థిగా మహ్మద్ ఫరూక్ పోటీచేసి వైసీపీ అభ్యర్థి శిల్పారవి చంద్రారెడ్డిపై గెలుపొందారు.
ముస్లింలు 30వేలకుపైగా ఉండి జనాభాపరంగా ఒకటో స్థానంలో ఉండి టీడీపీ గెలుచుకున్న శాససభ స్థానాలు:
క్రమసంఖ్య నియోజకవర్గం పేరు ముస్లిం జనాభా మొత్తం జనాభాలో శాతం
1 కర్నూలు 54,610 (21.10%)
2 గుంటూరు ఈస్ట్ 51,190 14.51
3 నంద్యాల 48,978 26.46
4 రాయచోటి 47,634 24.36
5 కడప 45,440 33.94
6 అనంతపురం అర్బన్ 42,928 16.80
7 ఆదోని 42,560 21.26
8 కదిరి 38,858 20.14
9 హిందూపూరం 37,366 20.58
10 ప్రొద్దుటూరు 35,330 20.39
11 ఆళ్లగడ్డ 35,205 18.64
12 పీలేరు 34,735 17.74
13 గుంతకల్లు 34,355 16.19
13 విజయవాడ వెస్ట్ 33,170 14.24
14 గుంటూరు వెస్ట్ 32,624 12.30
15 శ్రీశైలం 32,533 22.87
16 పుంగనూరు 31,309 15.98
ఇవికాక పలమనేరు, పాణ్యం, నందికొట్కూరు, పొన్నూరు, గురజాల, నరసరావుపేట, విజయవాడ సెంట్రల్, చిలకలూరిపేట, బాపట్ల, తాడికొండ, విశాఖపట్నం నార్త్, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి, గిద్దలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, తాడిపత్రి, కొవ్వూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, తంబళ్లపల్లె శాసనసభ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ స్థానాల్లో ముస్లింలు దాదాపు 25వేల చొప్పున ఉండి ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉండటం గమనర్హం.
జగన్‌రెడ్డికి షాక్
అధికార వైసీపీ కేవలం పులివెందుల, పుంగనూరు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. నిత్యం నా మైనారిటీలు అని మాట్లాడుతూ… వారికి ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా మేలు చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఈ ఫలితాలు భారీ షాక్‌నిచ్చాయి. కేవలం బటన్ నొక్కితే చాలు… ప్రజలు ఓట్లేస్తారు అనే విశ్వాసంతో గత ఐదేళ్లుగా మైనారిటీల ఆశలు, ఆకాంక్షలను సమగ్రంగా అర్థం చేసుకోకుండా పాలన సాగించినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ… ఎంతో మేలు చేసినా అవ్వతాతల ప్రేమ ఏమైందో అంటూ నిర్వేదంతో మాట్లాడిన ముఖ్యమంత్రి… తన ఓటమికి ప్రజలను తప్పుపట్టడాన్ని పరిశీలకులు ఆక్షేపిస్తున్నారు. తన సమగ్ర ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా జగన్‌రెడ్డి ప్రజలపై నెపంవేసి… తనతీరు మారదన్న సందేశాన్ని ఇచ్చారని వారి అభిప్రాయం.