- ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు
- రెండు స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి
- నేడు ఏర్పాటు కానున్న స్టాళ్లు
- అరకు కాఫీ ప్రమోషన్‌కు ప్రణాళికాబద్ధంగా సీఎం కృషి
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కారణంగా అరకు కాఫీ ఘుమఘుమలు నలుచెరగులా విస్తరిస్తున్నాయి. దేశంలోని అత్యున్నత చట్ట సభ పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్లమెంటు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులను అక్కడ అరకు కాఫీ కమ్మటి రుచులు అలరించనున్నాయి. ఈ మేరకు పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో 2 అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించారు. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢల్లీి వెళ్లారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఉత్తరాంధ్ర అడవులు.. ప్రత్యేకించి విశాఖ మన్యం అడవుల్లో సాగవుతున్న అరకు కాఫీకి ఎక్కడ లేని ప్రాధాన్యం ఉంది. రుచిలో ప్రపంచంలోనే అత్యుత్తమ వెరైటీగా నిలిచింది. 2014లో విభజిత ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అరకు కాఫీ ప్రమోషన్‌కు నడుం బిగించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్న చంద్రబాబు.. ఎక్కడికి వెళ్లినా అరకు కాఫీ పొడితో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు తీసుకుని మరీ వెళుతున్నారు. రాష్ట్రం బయట తాను కలిసే ప్రముఖులకు వాటిని ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి వస్తున్న ప్రముఖులకు కూడా వాటిని అందిస్తూ అరకు కాఫీని అన్ని ప్రాంతాల వారూ రుచి చూసేలా చేస్తున్నారు.
ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం అక్కడికి కూడా అరకు కాఫీని వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడ అరకు కాఫీతో కూడిన ఓ కెటిల్ ను పెట్టి ఏపీ పెవిలియన్ పరిసరాలను అరకు కాఫీ ఘుమఘుమలతో అదిరిపోయేలా చేసింది. తాజాగా పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుతో మరింత మందికి అరకు కాఫీ పరిచయం కానుంది. పార్లమెంటు సభ్యులతో పాటుగా ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఆయా పార్టీల కీలక నేతలు, ఆయా రాష్ట్రాలకు చెందిన మీడియా ప్రతినిధులు నిత్యం పార్లమెంటుకు వస్తూనే ఉంటారు. వారిని మన అరకు కాఫీ ఆకట్టుకోవడం ఖాయమే. త్వరలోనే అరకు ఘుమఘుమలు దేశవ్యాప్తంగా విస్తరించడం కూడా ఖాయమే.