అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రజారోగ్యం కుప్పకూలిపోయిందని చెప్పడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. గత ఐదేండ్ల అస్తవ్యస్త, అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఇందుకు కారణమైన జగన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కువిమర్శలు చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్తను కుప్పకూల్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్స్‌లో మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.
రాష్ట్రంలో అక్కడక్కడ డయేరియా ప్రబలడానికి గల కారణం కలుషిత మంచి నీరు అన్న విషయం మీకు తెలియదా? ఆ నీరు కలుషితం కావడానికి మీరు గత ఐదు సంవత్సరాలు పైపులైన్ల నిర్వహణ చేపట్టకపోవడమే కారణమని మీకు తెలియదా? 104, 108 వ్యవస్థల్ని మీ ఆస్థాన కంపెనీ అయిన అరబిందోకు కమీషన్ల కోసం అందించినపుడే ఆ వ్యవస్థ నిర్వీర్యం అయింది. ఆరోగ్య శ్రీ బిల్లులు గత సంవత్సరం నుంచి మీరు చెల్లించకపోవడం వలన 2,500 కోట్ల రూపాయలు కొత్త ప్రభుత్వం మీద భారం పడిరది. కొత్త మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సిన బిల్లుల రూపంలో భారం మరో రూ.1400 కోట్లు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నాబార్డ్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి దారి మళ్ళించారో చెప్పాలి? ఆ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సింది పోయి దారి మళ్లించి, వైద్య విద్యను అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను ఛిద్రం చేసింది మీరు కాదా? జీరో వేకెన్సీ పాలసీ గురించి మీరు మాట్లాడటం పెద్ద బూతు.
రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా, ఏ వైద్య కళాశాలను చూసినా పై నుంచి కింది వరకు అన్ని ఖాళీలే. మీ సొంత నియోజకవర్గం పులివెందుల వైద్య కళాశాలలో 48 శాతం ఫ్యాకల్టీ కొరత కారణంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీకు మొట్టికాయలు వేయలేదా? ఇతర బోధన ఆసుపత్రులలో కూడా సరైన సిబ్బంది లేకపోవడం వల్ల మీ హయంలో ఎన్‌ఎంసీ జరిమానా వేయలేదా? పీజీ సీట్లకు కేంద్రం ఇచ్చిన 750 కోట్ల రూపాయలను దారి మళ్ళించలేదా? మీ హయాంలో దేనికి రాష్ట్ర ఖజానా నుంచి పైసా కూడా విదల్చని మీరు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కడం మీకే హాస్యాస్పదంగా అనిపించడం లేదా? ధనకాంక్షతో సరఫరా చేసిన నాసిరకం జగన్ బ్రాండ్ మద్యం తాగి మూత్రపిండాల, కాలేయం వ్యాధి బారినపడిన వారి సంఖ్య ఐదేళ్లలో 1300 శాతం పెరగలేదా? వారి ఉసురు తీసిన పాపం మీది కాదా? మీరు చేసిన ఆ పాపాలు మాకు వారసత్వంగా లభించి శాపంగా మారాయి. కూటమి పభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మీరు చేసిన తప్పులన్నీ సరిదిదుతోంది. మీ హయాంలో ‘అనారోగ్యం’ బారిన పడిన శాఖని మళ్ళీ ‘ఆరోగ్య శాఖ’గా మార్చి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను, విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తోందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.