అమరావతి(చైతన్యరథం): భారత మహిళా అథ్లెట్, విశాఖకు చెందిన క్రీడాకారిణి యర్రాజీ జ్యోతి అర్జున అవార్డుకు ఎంపికవ్వడం తెలుగువారంతా గర్వించదగ్గ విషయమ ని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మన తెలుగు బిడ్డను అర్జున అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు అథ్లెట్ జ్యోతికి మాత్రమే కాదు మన తెలుగువారి విజయంగా భావించాలని తెలిపారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలకు ఈ అవార్డు మంచి ప్రోత్సాహమన్నారు. ఈ సందర్భంగా అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను సాధిం చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు.