- రైతులకు భరోసా కల్పించండి
- వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి`
కాకినాడ(చైతన్యరథం): ఏలేరు వరద ముంపు ప్రభావిత 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కాకినాడ జిల్లా అధికారులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వరద ఉధృతిపై మంగళవారం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు. గొల్లప్రోలు ప్రాంతంలో వరదలో చిక్కుకున్న రాజుపాలెం, కోలంక, సోమవరం, ఎస్.తిమ్మాపురం, వీరవరం, కృష్ణవరం, రామకృష్ణాపురం గ్రామాల్లోని పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మాధవపురం, నవఖండ్రవాడల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయక కేంద్రాలకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి శాఖల పరిధిలో దెబ్బ తిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య సేవల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడంతోపాటు, తగినన్ని ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణనష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పంటలు మునిగిన రైతులకు అధికారులు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పాలని, ముంపు తగ్గాక నష్టం వివరాల నమోదును వేగంగా చేయాలని స్పష్టం చేశారు. పశు సంపదకు నష్టం కలగకుండా చూడాలన్నారు. వరద తీవ్రతకు పడ్డ గండ్లు, ఫలితంగా పంట పొలాల మునకపై అధికారులు వివరాలు అందించారు. అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలను తెలిపారు. ప్రాథమికంగా ఉన్న అంచనా మేరకు 5,485 హెక్టార్లలో వరి, 90.4 హెక్టార్లలో పత్తి పంటలు నీట మునిగాయని వివరించారు. ఇప్పటి వరకూ 2 వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. అవసరమైన ఆహారం, తాగునీరు, మందులు అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సోమవారం రాత్రి నుంచి ప్రతి గంటకు ఒకసారి వరద ఉధృతిపై సమాచారం తీసుకొంటూ పర్యవేక్షిస్తున్నారు.