- కేంద్ర మంత్రులూ హాజరు
- 8 వేల మంది పోలీసులతో భారీ భద్రత
- వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
- జగన్ ప్రభుత్వ బాధిత కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం
- లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం
గన్నవరం,చైతన్యరథం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని 14 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కేసరపల్లిలో సువిశాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికతోపాటు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెండు భారీ షెడ్లు వేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎం, మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. మంగళవారం నాడు కూటమి ఎమ్మెల్యేలతో ఏ కన్వెక్షన్ హాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమౌతారు. ఆ సమావేశంలో ఎన్డీఏ శాసనాసభా పక్షనేతగా చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు గవర్నర్ నజీర్‌ను కలిసి. చంద్రబాబును తమ కూటమి శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. మంగళవారం సాయంత్రంలోగా చంద్రబాబను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు.
8 వేల మంది పోలీసులతో భారీ భద్రత
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 8వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐజీ రవి ప్రకాష్ తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సభా ప్రాంగణం చుట్టుపక్కల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సుమారు 30వరకు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని, స్థానికులు గమనించాలన్నారు. ఎస్పీజీ అధికారుల సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లు, అతిథులు, వీఐపీలు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. పటిష్ఠ బందోబస్తు నడుమ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు చేస్తున్నట్లు ఐజీ రవి ప్రకాశ్ వివరించారు.
వీఐపీల కోసం ప్రత్యేక బ్లాక్‌లు
వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజి సిద్ధం చేశారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వచ్చే అతిధులు, వీఐపీలు కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే ఆయా గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. కాగా గన్నవరం జాతీయ రహదారి పక్కన, వెటర్నరీ కళాశాల, కేసరపల్లి మేధా టవర్స్ లే ఔట్‌లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాలను అధికారులు సోమవారం పరిశీలించారు. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. మాజీ హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నట్టు చంద్రబాబు పేషీకి అధికారులు సమాచారం ఇచ్చారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి వస్తామని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. గన్నవరం ఎయిర్ పోర్టులో మొత్తం 12 హెలిప్యాడ్లకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని విమానంతో పాటు ఇతరుల విమానాల కోసం కూడా ఎయిర్ పోర్టు ఆధారిటీి ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసింది. వర్షాకాలం కావడంతో ఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రమాణ స్వీకారోత్సవ వేదికకు వీఐపీల కాన్వాయి వెళ్లే దారిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేస్తున్నారు.
లక్ష మందికి పైగా హాజరు
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీడీపీ అభిమానులు పొటెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం లక్షమందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష మందికి పైగా సరిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాఫీలు, టీల నుంచి టిఫిన్‌ల వరకు.. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నిర్వహించే మహానాడులో విందుకు ప్రత్యేకత ఉంది. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి టిఫిన్లతోపాటు.. మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మందికి భోజనాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే.. బస ఏర్పాట్లకు కూడా.. ప్రత్యక చర్యలు తీసుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జగన్ ప్రభుత్వ బాధితులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. వారి కోసం వేదిక వద్ద ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం వల్ల ప్రాణాలు కోల్పొయిన, ఇబ్బందులు పడ్డ 104 బాధిత కుటుంబాలకు ఆహ్వానం పంపారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రమణ్యం, అమర్‌నాథ్ గౌడ్ కుటుంబం లాంటి మొత్తం 104 బాధిత కుటుంబాలకు ఆహ్వానం పంపారు.