- సంక్షేమ పథకాల విస్తరణ, లబ్ధిరాశి పెంపు
- అభివృద్ధికి తగు ప్రాధాన్యత
- సంక్షేమ పథకాల్లో బీసీలకు పెద్దపీట
- దేశంలో మొదటిసారిగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా
- మొదటిసారిగా రాష్ట్ర ప్రజల నైపుణ్యత స్థాయి అంచనాకు స్కిల్ సెన్సస్
- నెలవారీ పింఛన్ రూ. 3 వేల నుండి రూ.4 వేలకు పెంపు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛను
- స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
- ప్రతి మహిళకు నెలకు రూ.1500
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ
- మెగా డీఎస్సీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
- డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
- సీపీఎస్ పై ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి
- కాపు సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15వేల కోట్లు
- ‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్’ గా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు
- డ్రైవర్లకు, అసంఘటిత రంగ కార్మికులకు చేయూత
- విద్యుత్, మద్యం రేట్ల నియంత్రణ
- ఉచిత ఇసుక విధానం తిరిగి అమలు
- దేవాలయాల ఆస్తుల రక్షణ, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు
- ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్ల సంక్షేమానికి హామీలు
- ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
రాష్ట్రంలో త్వరలో జరగనునున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ తరపున ఉమ్మడి మేనిఫెస్టో మూడు పార్టీల నేతల సమక్షంలో మంగళవారం సాయంత్రం విడుదలైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర నేత సిద్ధార్థనాథ్‌్ సింగ్ ల సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టోను వెల్లడిరచారు.
ఆరు పేజీల ఉమ్మడి మేనిఫెస్టోలో 28 వివిధ కులాలు, తరగతులకు చెందిన సంక్షేమంతోపాటు వివిధ రంగాలతో కూడిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి 180కి పైగా హామీలు, ప్రతిపాదనలను పొందుపరిచారు. ఇందులో 50కి పైగా ప్రతిపాదనలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవి కావటం విశేషం.
మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు
తెదేపా, జనసేన నాయకులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి కూటమి తరపున రూపొందించిన మేనిఫెస్టోకు భారతీయ జనతాపార్టీ తమ పూర్తి మద్దతు తెలిపింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఉమ్మడి మేనిఫెస్టోపై తమ పార్టీ వైఖరిని వివరించారు. దేశవ్యాప్త లోక్‌సభ ఎన్నికలకు భాజపా జాతీయ స్థాయిలో వివరణాత్మకమైన మేనిఫెస్టోను విడుదల చేసిందని.. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోల రూపకల్పనలో తాము పాలుపంచుకోమని, ఇది తమ పార్టీ సంప్రదాయమని ఆయన వివరించారు.అయితే.. తెదేపా జనసేనలు కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు తమకు తెలుసునని, ఈ మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి మేనిఫెస్టో విడుల కార్యక్రమంలో తాను పాల్గొనటమే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందన్న అంశానికి ప్రతక్ష్య నిదర్శనమని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి పూర్తిగా సహకరిస్తుందని..అదే రీతిలో దేశ ప్రగతికి దోహదపడుతుందని బీజేపీ ప్రగాఢంగా విశ్వసిస్తోందని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వివరించారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని.. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేస్తున్న కూటమి భారీ స్థాయిలో దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమది జాతీయ పార్టీ అని, రాష్ట్ర స్థాయిలో తెదేపా, జనసేనలు కలిసి రూపొందించిన మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు ఉందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
పాత, కొత్త హామీల కలయిక
గతంలో తెదేపా ప్రకటించిన సూపర్-6, బీసీ డిక్లరేషన్ లోని వివిధ హామీలకు పలు కొత్తవాటిని జోడిరచి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారు. జనసేన ప్రతిపాదించిన మరో ఆరు విషయాలతో ‘షణ్ముఖ వ్యూహం’ను జోడిరచారు. ఈ విషయంపై తెదేపా, జనసేనలు పలు రోజులపాటు తీవ్ర కసరత్తు చేశాయి.
విస్తృత సంక్షేమం
సంక్షేమం విషయంలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అధికార వైసీపీ మేనిఫెస్టో కంటే పూర్తి భిన్న వైఖరిని వెల్లడిరచింది. గత ఐదేళ్లు అదికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈనెల 27న తమ మేనిఫెస్టో విడుదల చేస్తూ అదనపు సంక్షేమ పథకాల విషయంలో పూర్తి అసహాయతను వ్యక్తం చేసి పరిశీలకులను, తమ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకపక్క తమ పాలనలో రాష్ట్రం భారీగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ.. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో గత ఐదేళ్ల్లుగా అమలైన సంక్షేమ పథకాలే కొనసాగిస్తానని చెప్పి.. అదనంగా సంక్షేమ బాధ్యతను మోయలేనని ప్రకటించుకున్నారు. ప్రధానంగా అవ్వా తాతలు ప్రస్తుతం పొందుతున్న రూ. 3 వేల నెలవారీ పింఛన్ లో రూ.250 పెంపుకు మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాలని ప్రకటించి జగన్ రెడ్డి తన వైఫల్యాన్ని తానే వెల్లడిరచుకున్నారు.
జగన్ రెడ్డి వైఖరికి భిన్నంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పలు కొత్త సంక్షేమ హామీలను ప్రకటించింది. నెలకు రూ. 4 వేల పింఛను, అదికూడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అందజేయటం, జగన్ రెడ్డి రద్దు చేసిన పలు బడుగు, బలహీన, మైనార్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ, పండుగ, పెళ్లి కానుకల పునరుద్ధరణ, బీసీ వర్గాల సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్ల వ్యయం వంటి పలు నూతన హామీలతో కూటమి సంక్షేమ పథకాల పరిధిని బాగా విస్తృతం చేసి కష్టాల్లో ఉన్న ఆపన్నులకు దండిగా సహాయాన్ని ప్రకటించింది.
అభివృద్ధిలోను కూటమిదే పైచేయి
పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచటానికి, వారి రేపటి ఆశల సాకారానికి, యువతలో నూతన ఉత్సాహాన్ని నింపటానికి కీలకమైన అభివృద్ధి విషయంలో కూడా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో స్పష్టమైన, భిన్నమైన వైఖరిని అవలంబించింది. సంక్షేమ పథకాల విస్తృత అమలుకు శీఘ్రతర అభివృద్ది, తద్వారా సంపద సృష్టిల అవసరాన్ని తెలియజేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కూటమి మేనిఫెస్టో స్పష్టమైన విధానాలను ప్రకటించింది. ‘ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావహులు, ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరటానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థిక అభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలు చేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేస్తాం’ అని పేర్కొంటూ మౌలిక వసతుల కల్పన, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పారిశ్రామికీకరణ మరియు పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి మార్గాలు, సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి ఈ
మేనిఫెస్టో పెద్దపీట వేసింది.
రాష్ట్రలో అభివృద్ధి పట్ల ఏనాడు శ్రద్ధ చూపని ముఖ్యమంత్రి జగన్ ఇటీవల విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో అభివృద్ధి గురించి క్లుప్తంగా, మొక్కుబడిగా ప్రస్తావించి నిర్దిష్ట విధానాలను వెల్లడిరచని వైఖరికి కూటమి మేనిఫెస్టో పూర్తి భిన్నంగా ఉందని పరిశీలకుల అభిప్రాయం.
సంక్షేమంలో బీసీలకు పెద్దపీట :
25 హామీలతో బీసీల (వెనుకబడిన వర్గాలు) సంక్షేమానికి కూటమి పెద్దపీట వేసింది. బీసీలకు 50 ఏళ్ల వయసున్నవారికి రూ.4వేలు నెలవారీ పెన్షన్, బీసీ సబ్ ప్లాన్ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్ల వ్యయం, రాజకీయ అధికారంలో భాగస్వామ్యంతోపాటు యాదవ/కురబ, చేనేత, నాయీ బ్రాహ్మణులు, గీత కార్మికులు, వడ్డెరలు, రజకులు, మత్స్యకారులు, స్వర్ణకారుల సాధికారతకు మేనిఫెస్టోలో వివిధ హామీలను ప్రకటించారు.
ఉద్యోగస్థులు, పెన్షనర్స్
గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో తీవ్ర కష్ట నష్టాలు, అవమానాలకు గురైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల కూటమి మేనిఫోస్టో దృష్టి సారించింది. వారి గౌరవాన్ని పున:ప్రతిష్టింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. సీపీఎస్ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్స్ కు ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని, వారికి చెందాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేసి, పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని కూటమి తెలిపింది.
బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ల వయసుకే నెలకు రూ. 4వేల పింఛను, ఈ వర్గాల ప్రత్యేక ప్రయోజనాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ, పేదలందరికి పట్టణాలు, గ్రామాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు చేసి పక్కా ఇళ్ల నిర్మాణానికి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
ఇతర ప్రధాన హామీలు
1. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంపు
2. వైకల్యం తీవ్రతను బట్టి దివ్యాంగుల పింఛన్లను రూ. 6 వేలు, రూ. 15 వేలకు పెంపు
3. ముస్లిం మైనార్టీలు, క్రిష్టియన్ల సంక్షేమానికి పలు హామీలు
4. ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేటు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరణ
5. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, బ్రాహ్మణుల సంక్షేమానికి పలు చర్యలు
6. చంద్రన్న బీమా పథకం పునరుద్ధరణ
7. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
8. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా