- ‘రాజధాని ఫైల్స్’ పేరు వింటేనే తాడేపల్లి పిల్లికి వణుకు
- మీ పాలనపై జనం దగ్గరకే వెళదాం
- డేట్, టైం మీరే చెప్పండి
- టీడీపీతోనే నిజమైన సంక్షేమం
- రెండు నెలల్లో అన్ని లెక్కలు తేలుస్తాం
నెల్లిమర్ల: పసుపు సైనికులు, జనసేన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మీరు చొక్కా చేతులు మడిస్తే, మేము కుర్చీలు మడతేసి, మీకు సీటు లేకుండా చేస్తామని హెచ్చరించారు. జగన్ ఏదో చెబుతున్నారు.. వైకాపా నాయకులు చొక్కా చేతులు మడతపెట్టుకుని పోరాటానికి సిద్ధంగా ఉండాలంటున్నారు. ఆ బూమ్‌బూమ్ బ్యాచ్‌కు చెబుతున్నా.. చొక్కా చేతులు మడతపెట్టుకుంటే ఊరుకునే వారు ఎవరూ లేరు. మీరు చొక్కా మడతపెడితే మేం కుర్చీలు మడతపెడతాం. మీ కుర్చీ మడతపెట్టి సీటు లేకుండా చేస్తామంటూ ఒక కుర్చీని మడతపెట్టి మరీ చూపించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు. మావైపు 60 లక్షల మంది పసుపుసైన్యం, లక్షలాది జనసైనికులు ఉన్నారు. మా వాళ్లు కుర్చీలు మడతపెడితే మీరు పారిపోవడం ఖాయం. మా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం. నీకు సీటు లేకుండా చేస్తాం.. మీరు రెడీనా అన్నప్పుడు సభకు హాజరైనవారి నుంచి మంచి స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకు షరతులు ఉండవు.. ఉత్తరాంధ్రప్రజల ప్రేమకు కూడా ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుం టారు. చెడు చేస్తే పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడ నుంచి ఏ కార్య క్రమం చేసినా విజయంసాధించడం ఖాయం. విజయ నగరంలో పైడితల్లి అమ్మవారి దేవాలయంతో పాటు, రామతీర్థం దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం.మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల ఈ ప్రాంతం అని లోకేష్ అన్నారు.
ఎందుకంత భయం
జగన్‌రెడ్డిని చూస్తే ప్యాలెస్‌లో పిల్లిలా కనిపిస్తున్నా డు. రాజధాని ఫైల్స్ సినిమా బయటకు రాకుండా అడ్డుకోవాలనుకున్నాడు. ఆసినిమా పేరు వింటేనే జగన్ రెడ్డికి భయం. రాజధాని ఫైల్స్ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్దకు పోలీసులను పంపాడు. ఎంతగా భయపడుతున్నాడో చూడండి. యాత్ర-2 సినిమా వైకా పాకు అంతిమయాత్రలా మారింది. రాజధాని విషయం లో జగన్‌రెడ్డి ఎన్నోసార్లు యు టర్న్‌లు తీసుకున్నారు. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలన్నాడు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదన్నాడు. రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి నమ్మించాడు. సొంత భూమి అందరి కల. 3 పంటలు పండే భూమి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. నాడు జగన్, పవన్, మోదీ కూడా అమరావతికి సంపూ ర్ణంగా మద్దతిస్తున్నామని చెప్పాకే భూములిచ్చారు. కానీ జగన్ నేడు రైతుల త్యాగాలను అవమానిస్తున్నాడు. జగన్‌రెడ్డి ఓ సైకో. వైకాపాలో ఉన్నవారందరూ సైకోలే. బ్లేడ్ బ్యాచ్ లే. రాజధానికి మద్దతిస్తామని చెప్పి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నా రు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు. సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు ఉండా లని చెబుతున్నారు. సిగ్గుండాలి. ఉన్న రాజధానిని చెడగొడతారు. మీరు రాజధానిని కట్టలేరు. అవకాశం లేని హైదరాబాద్ కావాలంటారా అని లోకేష్ మండిపడ్డారు.
జనం దగ్గరకే వెళదాం.. రెడీనా?
సైకో జగన్ ఒక మాట వాస్తవం చెప్పాడు. ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు లేరట..జనమే స్టార్ క్యాంపెయినర్లంట. ఛాలెంజ్ చేస్తున్నా…ప్లేస్, టైం చెప్పండి. మీరు తీసుకొచ్చిన బూమ్‌బూమ్ దుకాణాల వద్దకు వెళ్దాం..నీ పాలన ఎలా ఉందో మందుబాబులను అడుగుదాం..నువ్వు సిద్ధమా? మద్యం దుకాణాల వద్దకు వెళ్తే మందుబాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడతారో అర్థమవుతుంది. సాక్షి పేపర్, జగన్, వైకాపా నాయకులు సిద్ధమా? తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి..సంపూర్ణ మద్య నిసేధం చేశాక ఓట్లు అడుగతానన్నాడు చేశాడా.. ఊరూరా, ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నాడు. అధికారులకు టార్గెట్ లు ఇచ్చి మరీ మద్యం అమ్మిస్తున్నాడు.
రెండో ఛాలెంజ్ చేస్తున్నా…మీరు ఎంచుకున్న ఇంటికే వెళదాం. 4 ఏళ్ల పది నెలల పాలనలో మీరు పెంచిన నిత్యావసర సరకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వేసిన పన్నుల గురించి అడుగుదాం. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి, పెట్రోల్, డీజిల్ ధరలు, చెత్తపన్నులతో పాటు, నిత్యావసర ధరలు పెంచి పేదవారి ఇళ్ళు గుల్లచేస్తున్నారు. ప్రజలు వైసీపీకి కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డలు మీకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. డీఎస్సీ అభ్యర్థులు నన్ను కలిశారు. ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదు. నోటిఫికేషన్లు లేవు. ఈ సీఎం ఎప్పుడు దొరుకుతాడా అని యువత చూస్తున్నారు. యువత వద్దకు వెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? జాబ్ కేలండర్ ఏమైంది? జనానికి సమాధానం చెప్పలేక పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి. జగన్ ఎక్కడ కనబడతాడా కర్ర తీసుకుని తరిమితరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ స్పష్టం చేశారు.
10 ఇచ్చి 100 గుంజేస్తున్నారు
జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న రెడ్ బటన్‌తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. నిత్యావసరాల ధరలు పెంచి బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రావాల్సిన ఇన్‌పుట్ సబ్సీడీ కూడా కట్ చేశారని లోకేష్ దుయ్యబట్టారు.
టీడీపీ పాలనలో సంక్షేమానికి పెద్దపీట
సంక్షేమానికి చిరునామా టీడీపీ. ఆనాడు ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రైతులకు రూ.50కే హార్స్‌పవర్ మోటార్ ఇచ్చారు. చంద్రబాబు దీపం పథకం, అన్నదాత సుఖీభవ లాంటి అనేక పథకాలు తీసుకు వచ్చారు. దేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ప్రజలు పడుతున్న కష్టాలు పాదయాత్రలో చూశా. అందుకే చంద్రబాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏడాది డీఎస్సీ ద్వారా ఉపాధ్యాపోస్టులు భర్తీ చేస్తాం. 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ చెప్పారు.
పరిశ్రమలు తీసుకుస్తాం
అనంతకు కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకుస్తాం. సెజ్ ఏర్పాటు చేసి కియా మాదిరిగా పెద్ద పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానికులకే ఉద్యోగులు ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే టీడీపీ-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
అన్ని లెక్కలు తేలుస్తాం
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు మూడు కుటుంబాలకు లైసెన్స్ ఇచ్చారు. మొదటి కుటుంబం బొత్స, రెండో కుటుంబం విజయసాయిరెడ్డి, మూడో కుటుంబం పేరు వైవీ సుబ్బారెడ్డి. వీరంతా పందికొక్కుల్లా దోచుకుంటున్నారు. ఎక్కడ భూమి, చెరువు కనిపించినా కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకు ఉత్తరాంధ్రను కేంద్రంగా మార్చారు. రెండు నెలలు ఆగితే అన్ని లెక్కలు తేలుస్తామని లోకేష్ అన్నారు.
పేటీఎం కుట్రలను తిప్పికొట్టాలి
చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్‌కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిలబడతానని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3 గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ ప్రయత్ని స్తోంది. అప్రమత్తంగా ఉండాలి. వారి కుట్రలను తిప్పి కొట్టాలి. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఎవరు పని చేశారో లేదా నాకు ఫోన్ లో తెలిసిపోతుంది. నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. సీనియర్లను, జూనియర్లను అందరినీ గౌరవమిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. రాబోయే ఎన్నికల్లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కలసికట్టుగా పనిచేయాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
నేను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామినాయుడు నా దగ్గరకు వచ్చి అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేయించుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో లో వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్య క్రమాలు చేశాం. సీసీ రోడ్లు, టిడ్కో ఇళ్లు, బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. ఈ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా, ఒక్క రోడ్డు వేశారా, ఒక్క కుళాయి ద్వారా తాగునీరు అందించారా అని లోకేష్ ప్రశ్నించారు.
తప్పుడు కేసులు
రామతీర్థంలోని రాముడి ఆలయంలో రాముడి విగ్రహం తలనరికి వేసింది ఈ సైకో ప్రభుత్వ హయాంలోనే. ఎంతో బాధాకరం. ఆనాడు ఎలా జరిగిందని తెలుసుకోవడానికి చంద్రబాబు వస్తే ఇబ్బంది పెట్టి లారీలతో అడ్డుకున్నారు. టీడీపీ పోరాడితే మా కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. సూరిబాబుని తీసుకెళ్లి సీఐ, డీఎస్పీ చితకబాదారు. ఆయన సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆ సూరిబాబుకి నేను హామీ ఇస్తున్నా.. రెండు నెలలు ఓపిక పట్టండి. చట్టాలు అతిక్రమించిన పోలీసు అధికారులపై జ్యుడీషియల్ విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. టీడీపీ కార్యకర్తల జోలికి రావాలంటే కారిపోయేలా చేస్తానని లోకేష్ హెచ్చరించారు.
అడుగడుగునా దోపిడీ
నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఆయన కొడుకు మణిదీప్ ఇక్కడ ఉన్న మైన్‌లన్నీ కాజేస్తున్నారు. కొండలను పిండేస్తున్నారు, ఇసుకను కూడా వదిలిపెట్టడం లేదు. పేద ప్రజల భూములు కూడా వారి పేర్లపై మార్పించుకుంటున్నారు. అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. జగన్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు మళ్లీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు జెట్టీ ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారు. టీడీపీ-జనసేన వచ్చిన తర్వాత రెండేళ్లలో జెట్టీ ఏర్పాటుచేస్తాం. గతంలో మత్య్సకారులకు పడవలు, వలలు ఇచ్చాం. స్కూటర్లు, ఐస్‌బాక్స్ లు ఇచ్చాం. మేం వస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. తారకరామా రిజర్వాయర్ పూర్తిచేస్తాం. భోగాపురం విమానాశ్రమానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ చేస్తాం. మూతపడిన జూట్ మిల్లును తెరిపిస్తాం. పెండిరగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను వంద రోజుల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామని లోకేష్ చెప్పారు.