- అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్య సాయం అందించండి
- గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలి
- 33వ రోజు మంత్రి నారా లోకేష్ ‘‘ప్రజాదర్బార్’’ కు ప్రజల నుంచి విన్నపాలు
- అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి భరోసా
అమరావతి(చైతన్యరథం): ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 33వ రోజు ‘‘ప్రజాదర్బార్’’కు వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు…ఉండవల్లిలోని నివాసం వద్ద గురువారం ఉదయం నుంచే బారులు తీరారు. మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి.. పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్ని…
వైద్యసాయం అందించి ఆదుకోండి
అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడికి వైద్య సాయం అందించి ఆదుకోవాలని మంగళగిరి 12వ వార్డుకు చెందిన తమ్మిశెట్టి రమణమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త చనిపోయిన తాను కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నానని, తన చిన్న కుమారుడికి గుండెల్లో నీరు చేరి అస్వస్థతకు గురయ్యాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఎలాంటి ఆధారం లేని తన కుమారుడికి వైద్య సాయం అందించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చినకాకానికి చెందిన ముదవర్తి మౌనిక కోరారు. పరిశీలించి తగిన ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
మతిస్థిమితం లేని కారణంగా తమ కుమారుడు మూడు నెలలు తప్పిపోవడంతో అతడికి ఇచ్చే దివ్యాంగ పెన్షన్ నిలిపివేశారని, తిరిగివచ్చిన కారణంగా పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి సాయినగర్ కు చెందిన గుండా అన్నపూర్ణమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి 3,4 ఘాటు రోడ్ మలుపులకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని వెనిగళ్ల ఉమాకాంతం విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన సాలిక సాయమ్మ కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి శాశ్వత ఇల్లు మంజూరుతో పాటు రైతుకూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలని యర్రబాలెంకు చెందిన వల్లల సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
నిడమర్రు గ్రామంలో ఉన్న తన రెండెకరాల భూమికి సీఐడీ విచారణ పేరుతో గత మూడేళ్లుగా కౌలు నిలిపివేశారని, విచారించి కౌలు మంజూరుతో పాటు ప్లాట్స్ రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని రెడ్డి పద్మావతి కోరారు. పరిశీలించి తగిన ఆదేశాలు జారీచేస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్ని..
చర్చి స్థలం కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సద్దాంకాలనీ ఏల్ బేతల్ చర్చి స్థలం ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పాస్టర్ పీటర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కేటాయించిన 15 సెంట్లలో చర్చి నిర్మించుకుని ప్రార్థనలు చేసుకుంటున్నామని.. మోతే రమణ బాబు, బయలుపాటి రమణ, వారి అనుచరులు దౌర్జన్యం చేసి చర్చిలో వస్తువులను ధ్వంసం చేశారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. చర్చి స్థలాన్ని కాపాడటంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లా చొప్పరామన్నగూడెం ప్రజలు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గవరవరం గ్రామం నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తమ గ్రామంలో కోర్టు వివాదం కారణంగా స్థానిక ఎన్నికలు జరగలేదని, స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తున్న తమ గ్రామంలో కనీస అవసరాలైన తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, విద్య, వైద్యం విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక సంఘం నిధులు కూడా అందడంలేదని, చొప్పరామన్నగూడెంను ప్రత్యేక పంచాయతీగా చేసి రెండు గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న విష్టుసారథి సొసైటీ డ్రైవర్లకు గత ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేసిందని, లడ్డూ, గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశారని సిబ్బంది.. మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తమను రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
పాలేరు రిజర్వాయర్ కింద సేకరించిన తమ 7.18 ఎకరాల భూమికి ఇస్తామన్న నష్టపరిహారం ఇంతవరకు మంజూరుకాలేదని, పరిశీలించి నష్టపరిహారం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తలకొండపాడుకు చెందిన రాయల ఆదిశేషయ్య విజ్ఞప్తి చేశారు. ఆర్డీవోకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి నష్టపరిహారం అందేలా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన చిన్న, సన్నకారు రైతులు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు. బుడమేరు కాలువ మీద ఉన్న తొమ్మడ్ర వాగుకు 2వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని, వర్షాకాలంలో వాగునీరు పొంగి పొలాలపైకి ప్రవహించడం వల్ల పంట నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాగునీరు మళ్లింపునకు కాలువ నిర్మించి వరదను నివారించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.