- ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం
- విజిలెన్స్ నివేదిక రాగానే మాజీ వీసీపై చర్యలు
- ఘనంగా వర్శిటీ శతాబ్ది ఉత్సవాలు
- శాసనసభలో విద్య, ఐటీ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆంధ్రా యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, వర్సిటీలోని వివిధ వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎనఎంఆర్, 28రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా (ఎంటిఎస్) పరిగణించడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్జప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఏపీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారు. దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నాం.
రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తిచేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. మ్యాన్‌పవర్ ఆడిట్ తర్వాత ఫైనాన్స్‌తో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాం. మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నివేదిక రాబోయే 45రోజుల్లో వస్తుంది. ఆ రిపోర్టు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆంధ్రావర్సిటీ 2019లో ఎనఐఆరఎఫ్ ర్యాంకింగ్‌లో 29వ ర్యాంక్‌లో ఉండగా, 2023నాటికి 76వ ర్యాంక్‌కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్-10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం. వందేళ్ల ఉత్సవాలను ఘనంగా జరపాలని గౌరవ సభ్యులు కోరారు. రేపు విశాఖ పర్యటనలో వీసీని కలిసి కార్యక్రమ నిర్వహణపై సమీక్షిస్తా. సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తే ఘనంగా శతాబ్ది ఉత్సావాల నిర్వహణకు చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ వెల్లడించారు.














